పెద్ద పులి సంచారం.. అటవీ ప్రాంతంలో భయాందోళన

పెద్ద పులి సంచారం.. అటవీ ప్రాంతంలో భయాందోళన

వరంగల్: పెద్ద పులి సంచారంతో అటవీ ప్రాంత ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఎటు నుండి వస్తుందో…ఎప్పుడు దాడి చేస్తుందోనన అడవి బిడ్డలు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికుల సమాచారం. పంట చేలల్లో దూది తీస్తున్న కూలీలకు పెద్ద పులి కనిపించటంతో అ పంట చేలకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొంది.

ములుగు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం శివారు దేవునిగుట్ట వద్ద పెద్దపులి వారం రోజులుగా సంచరిస్తోందని స్థానికులు భయాందోళనతో ఉలిక్కిపడుతున్నారు. మూడు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను బీట్‌ అధికారులు అప్రమత్తం చేశారు. అటవీ ప్రాంతాల్లోని రైతులు, పశువులు కాసే కాపర్లు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్టు అదికారులు సూచించారు. రాత్రివేళ అటవీ శివారు ప్రాంతాలకు ఎవరూ ఒంటరిగా  వెళ్లవద్దని కోరారు. పెద్ద పులి ఎక్కడ సంచరిస్తుందోనని తెలుసుకోవటం కోసం పెద్ద పులి పెద్దపులి అడుగుల ఆనవాళ్లు సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులు.

ములుగు, మహబూబాబాద్‌, భూపాలపల్లి  జిల్లాల అటవీ సరిహద్దు గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. మహబూబాద్‌ జిల్లా గంగారం,ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లవ్వాల, బంధాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవి ప్రాంత సరిహద్దు గ్రామాల పరిధిలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. పెద్ద పులికి రోజూ 40 కిలోమీటర్ల మేర నడిచే సామర్థ్యం ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అందువల్ల పెద్ద పులి ఎప్పుడు ఎక్కడ సంచరిస్తుందో తెలుసుకోవడం అటవీశాఖ అధికారులకు కష్టతరంగా మారింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.