- మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్న ఐదు టైగర్స్
- కొద్ది రోజులుగా అటవీ ప్రాంత గ్రామాల్లో అలజడి
- మేటింగ్ సీజన్ కావడంతో తోడు కోసం ఆరాటం
- పులుల రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టిన
- ఫారెస్ట్ అధికారులు
మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో పెద్దపులులు సందడి చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఒక్క మంచిర్యాల జిల్లాలోనే ఐదు పులులు తిరుగుతున్నాయి. కవ్వాల్ కోర్ ఏరియా పరిధిలోని జన్నారం మండలం ఇంధనపల్లి రేంజ్ లో ఒకటి, బఫర్ ఏరియా పరిధిలోని హాజీపూర్, కాసిపేట, వేమనపల్లి, జైపూర్ మండలాల్లో మరో నాలుగు టైగర్స్ సంచరిస్తున్నాయి. నవంబర్ నుంచి జనవరి వరకు పెద్దపులుల మేటింగ్ సీజన్ కావడంతో తోడు కోసం వెతుకుతూ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పెద్దపులుల రాకను గుర్తించిన అధికారులు వాటికి ఎలాంటి హాని కలగకుండా పకడ్బందీగా మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు వాటి నుంచి ఎలాంటి ముప్పు ఎదురుకాకుండా ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.
ఒకేసారి ఐదు టైగర్స్
మంచిర్యాల జిల్లాలోకి ఒకేసారి ఐదు పెద్ద పులులు రావడం అరుదైన విషయంగా అటవీ అధికారులు భావిస్తున్నారు. కవ్వాల్ కోర్ ఏరియా పరిధిలోని ఇంధన్ పల్లి రేంజ్ లో ఓ ఫిమేల్ టైగర్ కొద్దిరోజులుగా తిరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇది మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి ఆదిలాబాద్ మీదుగా కవ్వాల్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయినట్టు గుర్తించారు. హాజీపూర్ మండలం ర్యాలీ ఫారెస్ట్ లో మరో ఫిమేల్ టైగర్ సంచరిస్తోంది. ఇది నిరుడు డిసెంబర్ లోనే వచ్చిందని, ఏడాదికాలంగా ఇదే ఏరియాలో ఆవాసం ఏర్పాటు చేసుకుందని పేర్కొంటున్నారు. అలాగే మరో పెద్దపులి కాసిపేట మండలంలో కనిపించింది. తరచూ పశువుల మందలపై దాడి చేస్తూ ఉనికి చాటుకుంటోంది. తాజాగా వేమనపల్లి, జైపూర్ మండలాల్లో మరో రెండు పులుల జాడలను అధికారులు పసిగట్టారు. ఈ రెండు కూడా మేల్ టైగర్స్ గా భావిస్తున్నారు. రెండు రోజుల కిందట వేమనపల్లి మండలం చామనపల్లి, బంధంపల్లి అటవీ ప్రాంతంలో ఓ పులి మేతకు వెళ్లిన పశువుల మందలోని కోడెపై దాడి చేసింది. పశువుల కాపరి పవన్ పులి కనిపించడంతో చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. అంతకుముందు ఇదే పులి నెన్నెల మండలం కుష్నపల్లి రేంజ్ పరిధిలో సంచరించింది. ఫారెస్ట్ అధికారులు టైగర్ పెగ్ మార్క్స్ గుర్తించారు. మరో మేల్ టైగర్ జైపూర్ మండలం శివ్వారం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
జత కుదిరేనా..?
నవంబర్ నుంచి జనవరి వరకు టైగర్స్ మేటింగ్ సీజన్ కావడంతో పెద్ద పులులు తోడు కోసం అన్వేషిస్తూ అడవులను జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో మూడు ఫిమేల్, రెండు మేల్ టైగర్స్ సంచరిస్తున్నాయి. ఇవి ఒకదానికొకటి ఎదురుపడితే వాటి మధ్య మేటింగ్ జరిగి, ఇక్కడే సంతానోత్పత్తి చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఈ ప్రాంతం పులులకు ఆవాసంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు యానిమల్ ట్రాకర్స్, సీసీ కెమెరాల ద్వారా టైగర్ మూమెంట్ ను మానిటరింగ్ చేస్తున్నారు. గతంలో శివ్వారం, పిన్నారం అడవుల్లో రెండు పులులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కి చనిపోయాయి. అంతకుముందు మరో రెండు పులులు ఇదే రీతిలో మరణించాయి. దీంతో పులుల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు.
