రోహిత్‌‌ రెడ్డి ఫామ్‌‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు

రోహిత్‌‌ రెడ్డి ఫామ్‌‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు
  • పైలెట్ ​రోహిత్‌‌ రెడ్డి స్నేహితుడు డాక్టర్ బాలాజీ వద్దకు చేరిన ఎండీఎంఏ
  • 4 ఎండీఎంఏ స్ట్రిప్స్​ను తీసుకున్న ఎంపీ మహేశ్, నమిత్‌‌ శర్మ
  • సిట్‌‌ దర్యాప్తులో బయటపడుతున్న డ్రగ్స్‌‌ గోవా లింకులు
  • ఆరుగురు సప్లయర్లు డోర్​డెలివరీ చేస్తున్నట్లు గుర్తింపు
  • నేడు రోహిత్‌‌రెడ్డి కస్టడీ పొడిగింపు పిటిషన్‌‌పై విచారణ

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్ ​రోహిత్‌‌ రెడ్డి ఫామ్‌‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఫామ్‌‌హౌస్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీలకు రోహిత్ రెడ్డి ఆర్డర్ చేసిన ఎండీఎంఏ, కొకైన్‌‌ ఇతర డ్రగ్స్​ను గోవా పబ్‌‌ కు చెందిన డీజే క్లింటన్‌‌ అనే పెడ్లర్‌‌‌‌తోపాటు మరో ఆరుగురు సప్లయర్లు డోర్‌‌‌‌ డెలివరీ చేస్తున్నట్లు సిట్‌‌ దర్యాప్తులో తేలింది. ఈ మేరకు మూడు రోజుల కస్టడీ విచారణలో రోహిత్‌‌ రెడ్డి సహా ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్టర్‌‌‌‌నమిత్ శర్మ నుంచి కీలక సమాచారం సేకరించారు.

క్లింటన్‌‌ ద్వారా డాక్టర్​ బాలాజీకి ఎండీఎంఏ 
గోవాకు చెందిన డీజే క్లింటన్‌‌పై 2012లో డ్రగ్స్ ట్రాఫికింగ్‌‌ కేసు నమోదైంది. ఇతను హైదరాబాద్‌‌, బెంగళూరు‌‌లోని పబ్బులకు డగ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే  రోహిత్‌‌ రెడ్డితోపాటు ఆయన స్నేహితుడు జూబ్లీహిల్స్‌‌కు చెందిన డాక్టర్‌‌‌‌ బాలాజీకి క్లింటన్‌‌తో లింకులు ఉన్నట్లు సిట్‌‌ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

కాగా, ఈ నెల 14న ఫామ్‌‌హౌస్‌‌లో జరిగిన వీకెంట్‌‌ పార్టీ కోసం క్లింటన్‌‌ ద్వారా డాక్టర్ బాలాజీకి 4 ఎండీఎంఏ స్ట్రిప్పులు చేరినట్లు సిట్‌‌ గుర్తించింది. వీటిని రోహిత్‌‌ రెడ్డి సూచనల మేరకు బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి డ్రైవర్ అక్తర్‌‌‌‌కు బాలాజీ అందించినట్లు తేల్చారు.

కౌశిక్ రవి డ్రైవర్ ద్వారా ఫామ్‌‌హౌస్‌‌లోకి..
కౌశిక్ రవి డ్రైవర్‌‌అక్తర్‌‌‌‌ తన వద్ద ఉన్న 4 ఎండీఎంఏ స్ట్రిప్పులను ఫామ్‌‌హౌస్‌‌ వాచ్‌‌మెన్‌‌ కూతురు ద్వారా లోపలికి పంపించినట్లు సిట్‌‌ గుర్తించింది. ఈ మేరకు ఫామ్‌‌హౌస్ సిబ్బంది స్టేట్‌‌మెంట్లు రికార్డు చేసినట్లు తెలిసింది. బాలాజీ అందించిన స్ట్రిప్స్​ను పార్టీలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌‌ యాదవ్, కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు నమిత్‌‌ శర్మ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

కాగా, డాక్టర్ బాలాజీ ఇచ్చిన సమాచారం ఆధారంగా గోవాకు చెందిన డీజే క్లింటన్, రాకేశ్ శర్మ, అభిషేక్ సింగ్ సహా మరో ముగ్గురు డ్రగ్స్ సప్లయర్ల కోసం సిట్‌‌ గాలిస్తోంది. ఈ మేరకు గోవాకు రెండు టీమ్స్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితుల కస్టడీ పొడిగింపునకు సంబంధించిన పిటిషన్‌‌పై ఉప్పర్‌‌‌‌పల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.