బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 అనూహ్య మలుపులు తిరుగుతోంది.. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ రాబోతున్న తరుణంలో.. హోస్ట్ నాగార్జున ఈ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ప్రకటించి హౌస్‌మేట్స్‌కు, ప్రేక్షకులకు భారీ షాక్ ఇచ్చారు. బలమైన కంటెస్టెంట్‌లుగా వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఇచ్చిన ఇద్దరు ఒకేసారి బయటకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇది ఒకింత ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఊహించని ప్రకంపనలు
సాధారణంగా ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం జరుగుతుంది. అయితే, ఈసారి నాగార్జున ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. శనివారం నాటి ఎపిసోడ్‌లోనే నామినేషన్స్‌లో ఉన్న 10 మంది హౌస్‌మేట్స్‌ను గార్డెన్ ఏరియాకు పిలిచి, ఆ రోజుకే ఒక ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రకటనతో హౌస్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వారం నామినేషన్స్‌లో ఇమ్మానుయేల్, కెప్టెన్సీ ఇమ్యూనిటీతో ఉన్న తనూజ మినహా దాదాపు అందరూ ఉన్నారు. ఊహించని విధంగా, బలమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. నిఖిల్ ఎలిమినేషన్ హౌస్‌మేట్స్‌ను కలవరపెట్టింది. నిఖిల్ గేమ్ బాగానే ఉన్నప్పటికీ, ఓటింగ్ పరంగా వెనుకబడటం ఆశ్చర్యకరం.
ఆదివారం ఎపిసోడ్‌లో గౌరవ్ ఔట్
శనివారం నిఖిల్ ఎలిమినేట్ అయినప్పటికీ, నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందే ప్రకటించారు. దీంతో ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం గౌరవ్, దివ్య డేంజర్ జోన్‌లో నిలబడ్డారు. దీంతో వారిద్దరికి ఇచ్చిన టాస్క్ లో గౌరవ్ ఓడిపోయారు. దీంతో ఈ ఆదివారం ఎపిసోడ్‌లో హౌస్ నుండి గౌరవ్ ఎలిమినేట్ కాబోతున్నాడు. గౌరవ్, నిఖిల్ ఇద్దరూ మొదటి నుంచీ గేమ్ లో వెనుకబడ్డారు. పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో పాటు ఓటింగ్ కూడా తక్కువగా రావడంతో హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.
వైల్డ్‌కార్డ్స్ కథ సమాప్తం
ఈ డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ 9 సీజన్‌లో ఒక ప్రత్యేకమైన సంతరించుకుంది. ఈ సీజన్‌లో హౌస్‌లోకి మొత్తం ఆరుగురు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌లు అడుగుపెట్టారు. వారిలో రమ్య, మాధురి, సాయి, అయేషా ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. నిఖిల్ శనివారం ఎలిమినేట్ అయ్యారు. ఇక గౌరవ్ ఆదివారం ఎలిమినేట్ కాబోతున్నాడు. నిఖిల్, గౌరవ్ ఔట్ అవ్వడంతో, ఈ సీజన్‌లో హౌస్‌లోకి వచ్చిన వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌లు అందరూ ఎలిమినేట్ అయినట్లు అయింది. కేవలం అసలు కంటెస్టెంట్‌లు మాత్రమే మిగిలారు.
ఫ్యామిలీ వీక్ కోసం మిగిలిన 9 మంది
ఈ డబుల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో ఇప్పుడు కేవలం తొమ్మిది మంది కంటెస్టెంట్‌లు మాత్రమే మిగిలారు. వచ్చేవారం ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్‌ల కుటుంబ సభ్యులు హౌస్‌లో ఉంటారు. ఎంతో భావోద్వేగభరితంగా ఉండే ఫ్యామిలీ వీక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
