తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ క్రేజ్ ఉన్న రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 9 ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. గత వంద రోజులుగా ఉత్కంఠభరితమైన టాస్క్‌లు, ఎమోషన్స్, గొడవలు, అనూహ్య మలుపులతో సాగిన ఈ ప్రయాణం రేపు (డిసెంబర్ 21న ఆదివారం) జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. పండగ వాతావరణాన్ని తలపించే ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాల ప్రేక్షకులు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
హోరాహోరీగా టైటిల్ పోరు
ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కళ్యాణ్, సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ మధ్య టైటిల్ రేసు అత్యంత రసవత్తరంగా మారింది. సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం ప్రతి ఒక్కరికీ గట్టి ఫ్యాన్ బేస్ ఉండటంతో, విన్నర్ ఎవరనేది అంచనా వేయడం కష్టంగా మారింది. ఈ ఉత్కంఠను మరింత పెంచుతూ, మేకర్స్ హౌస్‌లోకి సెలబ్రిటీల ఎంట్రీతో సందడి మొదలుపెట్టారు.
హౌస్‌లో సెలబ్రిటీల సందడి
ఫైనలిస్టులను పలకరించేందుకు పలువురు సినీ, టీవీ ప్రముఖులు హౌస్‌లోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, హీరో శివాజీ తన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటి లయ, మాస్టర్ రోహన్‌తో కలిసి వచ్చి హౌస్‌లో జోష్ నింపారు. తర్వాత 'ది రాజాసాబ్' సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన నిధి అగర్వాల్, కంటెస్టెంట్స్‌తో ఆసక్తికరమైన గేమ్‌లు ఆడించారు. అటు బుల్లితెర స్టార్ యాంకర్స్ ప్రదీప్ మాచిరాజు, శ్రీముఖి ఎంట్రీతో హౌస్ నవ్వులతో నిండిపోయింది. 'బీబీ జోడీ' సీజన్ 2 గురించి ప్రదీప్ ప్రస్తావించారు. కంటెస్టెంట్ మధ్య సింపుల్ టాస్క్ లు పెట్టారు.
కల్యాణ్ గాయం:.. అసలేం జరిగింది?
తాజా ప్రోమోలో కల్యాణ్ తలకు కట్టుతో కనిపించడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. టాస్క్ లో భాగంగా ఎవరితోనైనా గొడవ జరిగిందా లేదా ప్రమాదవశాత్తూ తగిలిందా అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. నిధి అగర్వాల్ హౌస్‌లోకి వచ్చినప్పుడు కంటెస్టెంట్లకు కళ్లకు గంతలు కట్టి ఒక సరదా గేమ్ ఆడించారు. ఈ గేమ్ ఆడుతున్న సమయంలో కల్యాణ్ అదుపు తప్పి పక్కనే ఉన్న ఒక వస్తువును బలంగా ఢీకొట్టారు. దీనివల్ల అతడి నుదుటిపై చిన్న గాయమైంది. బిగ్ బాస్ టీమ్ వెంటనే వైద్య సాయం అందించి కట్టు కట్టారు. గాయం తీవ్రమైనది కాదని, కేవలం ముందు జాగ్రత్త చర్యగానే కట్టు కట్టారని సమాచారం. కాబట్టి కల్యాణ్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెబుతున్నారు..
ఫినాలే ట్విస్టులు
పుష్ప స్కిట్‌లో భాగంగా కల్యాణ్ తనూజను గిల్లడం, ఇమ్మాన్యుయేల్ తన మార్క్ కామెడీతో శ్రీముఖిని ఆటపట్టించడం వంటి సన్నివేశాలు ఫినాలే ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో విజేతగా నిలిచి ఆ బంగారు ట్రోఫీని ముద్దాడే అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే!
