V6 News

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 ఫినాలే ఫైట్‍లో భరణి అవుట్.. ఇమ్ముకు గాయం.. సంజనా కన్నీళ్లు!

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 ఫినాలే ఫైట్‍లో భరణి అవుట్.. ఇమ్ముకు గాయం.. సంజనా కన్నీళ్లు!

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి చేరువవడంతో హౌస్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ వారం సాధారణ నామినేషన్లను పక్కనపెట్టి, కంటెస్టెంట్లు నేరుగా ఫైనలిస్టులుగా ఎంపికయ్యేందుకు వీలుగా 'లీడర్ బోర్డు' టాస్క్‌ను బిగ్‌బాస్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే నిలకడైన ప్రదర్శనతో కల్యాణ్ తొలి ఫైనలిస్ట్‌గా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ ఎవరో తేల్చేందుకు భరణి, తనూజ, ఇమ్మాన్యుయేల్‌, సంజనా మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

భరణి ఔట్.. 

బిగ్ బాస్ 96 రోజు ఎపిసోడ్ లో 'లీడర్ బోర్డు' పాయింట్లలో చిట్టచివరి స్థానంలో ఉన్న భరణి ఆట నుంచి మొదటగా వైదొలిగాడు. ఇప్పటికే సుమన్ శెట్టి ఔట్ అయ్యాడు. మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ 'కీ టు సక్సెస్' అనే కీలకమైన టాస్క్‌ను ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లోని వివిధ ఆకృతుల్లో ఉన్న షీట్లకు గల తాళాలను తీసి, వాటిని తెచ్చి తమ ఎదురుగా ఉన్న బోర్డులో అమర్చాలి.

 కొట్టుకునేదాకా వెళ్లిన కంటెస్టెంట్స్!

ఈ 'కీ టు సక్సెస్' టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజనా మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇమ్ము, సంజనా చురుగ్గా షీట్లను తెచ్చి బోర్డులో అమర్చగా, తనూజ కూడా గట్టి పోటీనిచ్చింది. ఈ క్రమంలో, బోర్డులో అమర్చిన తమ షీట్లను కాపాడుకోవాలని బిగ్‌బాస్ సూచించడంతో ..  కంటెస్టెంట్ల మధ్య ఘర్షణ చెలరేగింది. తమ షీట్లను కాపాడుకునేందుకు, ఎదుటివారి షీట్లను తీసేందుకు వారు పడిన కుస్తీ యుద్ధం ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది.  ప్రేక్షకులకు మంచి మాస్ మసాలా అందించే షోగా మారింది.

ఇమ్ముకు గాయం.. 

 ఇమ్మాన్యుయేల్‌ మెజారిటీ గేమ్స్‌ను గెలిచి రెండో టికెట్ టు ఫినాలే రేసులో ధృడంగా నిలబడ్డాడు. అయితే ఈ టాస్క్ లో ఇమ్ము శారీరకంగా, మానసికంగా అలసిపోయినట్లు కనిపించాడు. సంజనాతో గొడవపడుతూ.. మీరు ఫస్ట్ వచ్చి నాది లాగారు, ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారు? అంటూ ఆవేదన చెందాడు. మరోవైపు, ఆటలో ఓటమిని తట్టుకోలేక సంజనా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను తదుపురి టాస్క్ నుంచి అందరి ఏకాభిప్రాయంతో తొలగించారు.. ఫైనల్‌గా రెండో ఫైనలిస్ట్‌ స్థానం కోసం ఇమ్ము, తనూజ మధ్య బాల్స్ గేమ్ టాస్క్ జరిగింది. అయితే ఈ హోరాహోరీ పోరులో ఇమ్ము కాలు బెణికి కిందపడిపోయాడు. విపరీతమైన నొప్పితో విలవిల్లాడిన అతడిని చికిత్స నిమిత్తం మెడికల్ రూమ్‌కు తరలించారు. ఈ ఊహించని పరిణామంతో.. ఈ గేమ్‌లో తనూజ విజయం సాధించిందా.. లేదా అనేది పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే!