Bigg Boss 9 : బిగ్‌బాస్ హౌస్‌లో 'క్యారెక్టర్' రచ్చ.. డీమాన్-రీతూ బంధంపై సంజన వివాదాస్పద వ్యాఖ్యలు!

Bigg Boss 9 : బిగ్‌బాస్ హౌస్‌లో 'క్యారెక్టర్' రచ్చ.. డీమాన్-రీతూ బంధంపై సంజన వివాదాస్పద వ్యాఖ్యలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. విజేత ఎవరో తేల్చే చివరి అంకానికి చేరుకుంది. 12వ వారం మొదలవడంతో, హౌస్‌లోని 9 మంది సభ్యుల మధ్య స్నేహాలు తెగిపోయి, ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీ పోరాటం మొదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఏకంగా హౌస్‌లో మాటల యుద్ధాన్ని రాజేసింది. ముఖ్యంగా, కెప్టెన్ రీతూ చౌదరి, సంజన గల్రానీ మధ్య జరిగిన వాదన.. ఒకరి క్యారెక్టర్‌ను టార్గెట్ చేసే స్థాయికి వెళ్లి, హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

 కెప్టెన్సీ అధికారంతో రీతూ టార్గెట్..

ఈ వారం కెప్టెన్‌గా ఉన్న రీతూ.. నామినేషన్ల నుంచి సేఫ్ అయినప్పటికీ, ఇద్దరిని నేరుగా నామినేట్ చేసే అధికారం దక్కింది. ఈ అధికారాన్ని ఉపయోగించి ఆమె ముందుగా కల్యాణ్‌ను, ఆ తర్వాత సంజన గల్రానీని నామినేట్ చేసింది. సంజన గారు, మీరు మొదటి రెండు వారాలు మాత్రమే హౌస్‌లో కనిపించారు. గేమ్ చివరి దశకు వచ్చినా.. మీ నుంచి సరైన పెర్ఫార్మెన్స్ కనిపించడం లేదు. అందుకే నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది.. దీంతో సంజన కోపంతో ఊగిపోయింది. నీలాగా గట్టిగా అరవడం, బూతులు మాట్లాడడం నాకు రాదు. ఇన్ని వారాలు నేను నిద్రపోతూ వచ్చానా? అంటూ రీతూపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేసింది. ఇక్కడి నుంచే సంజన వాదన వ్యక్తిగత దూషణలకు దారితీసింది.

 వివాదాస్పద కామెంట్స్..

నామినేషన్ కోపంలో సంజన తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మాటలు హౌస్‌మేట్స్ అందరినీ షాక్‌కి గురిచేశాయి. రీతూ డీమాన్ పవన్ మధ్య ఉన్న స్నేహాన్ని అపార్థం చేసుకుని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నువ్వు రోజు రాత్రి డీమాన్ తో కూర్చుంటావ్. అంటుకుని తిరుగుతావ్.. నాకు చూడటానికి కంఫర్ట్‌గా అనిపించడం లేదు. రోజూ అది చూస్తే కళ్లు మూసుకోవాల్సి వస్తుంది అంటూ కామెంట్స్ చేసింది. ఈ మాటలు హౌస్‌లో పెను తుఫాను సృష్టించాయి. తన క్యారెక్టర్‌ను టార్గెట్ చేయడంతో రీతూ చౌదరి కన్నీళ్లు పెట్టుకుంది. ఒక అమ్మాయి క్యారెక్టర్ పై ఇలా ముద్ర వేయడం కరెక్ట్ కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

 హౌస్‌లో సంజన ఒంటరి

రీతూ కన్నీళ్లు పెట్టుకోగానే.. హౌస్‌లోని సభ్యులందరూ సంజనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇమ్మాన్యుయల్ పరుగున వచ్చి సంజనను తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. డీమాన్ పవన్ కూడా బాధపడుతూ.. ఫ్రెండ్స్‌గా కూర్చుంటే తప్పుగా మాట్లాడతారా అని ప్రశ్నించాడు. ఈ ఘటనతో హౌస్‌లో సంజన దాదాపు ఒంటరైంది. అయితే సోషల్ మీడియాలో కూడా ఈ నామినేషన్ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మహిళా కంటెస్టెంట్ వ్యక్తిగత స్నేహాన్ని వక్రీకరించి క్యారెక్టర్‌ను ప్రశ్నించడంపై నెటిజన్లు సంజనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఉన్న సంజనకు ఈ నెగెటివిటీ మరింత ఇబ్బంది కలిగించే అవకాశం కనిపిస్తోంది.