దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చాం.. చరిత్రలోనే ఇదొక గొప్ప మైలురాయి: జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ రియాక్షన్

దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చాం.. చరిత్రలోనే ఇదొక గొప్ప మైలురాయి:  జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ రియాక్షన్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చామన్నారు. దీంతో దీపావళికి ముందే దేశ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. దీపావళి, చత్ పూజకు ముందే దేశ ప్రజలకు డబుల్ దమాకా ఇస్తామని ఆగస్ట్ 15 సందర్భంగా ఎర్రకోట నుంచి హామీ ఇచ్చాను.. మాట ఇచ్చినట్లుగానే దీపావళికి ముందే ప్రజలకు గిఫ్ట్ ఇచ్చానన్నారు మోడీ. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు . 

దేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి తదుపరి తరం సంస్కరణలు అవసరమని భావించానని.. అందుకే జీఎస్టీ పన్ను విధానంలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కొత్త సంస్కరణల వల్ల ఆత్మనిర్భర భారత్ లక్ష్యం మరింత ముందే సాకారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం (సెప్టెంబర్ 4) ఢిల్లీలోని 7లోక్ కళ్యాణ్ మార్గ్‌లో జాతీయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ శ్లాబుల సవరణలతో అందరికీ ప్రయోజనం ఉంటుందని.. సమయాన్ని బట్టి సంస్కరణలు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత జీఎస్టీ సంస్కరణలు అతిపెద్ద నిర్ణయంగా అభివర్ణించారు. సంస్కరణలతో జీఎస్టీ పన్ను విధానం మరింత సులభతరంగా, పారదర్శకంగా మారిందన్నారు. జీఎస్టీ సంస్కరణలు దేశానికి మద్దతు, వృద్ధికి డబుల్ డోస్ అని అభివర్ణించారు. 

జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు సరళమైన పన్ను వ్యవస్థ, జీవన నాణ్యతను మెరుగుపరచడం, వినియోగం మరియు వృద్ధిని పెంచడం, వ్యాపార సౌలభ్యత, సహకార సమాఖ్యవాదం అనే ఐదు రత్నాలను జోడించాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన సమయంలో మార్పులు అవసరమని.. అలా అయితేనే ప్రపంచంలో మన దేశాన్ని సరైన స్థానంలో నిలబెట్టొచ్చన్నారు. 

2025, సెప్టెంబర్ 22న అంటే నవరాత్రి మొదటి రోజున జీఎస్టీ తదుపరి తరం సంస్కరణలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా, జీఎస్‌టీలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 5, 12, 18, 28 శాతాల్లో నాలుగు రకాలుగా ఉన్న జీఎస్టీ ట్యాక్స్ స్లాబ్‎లను ఇకపై 5 శాతం, 18 శాతం స్లాబ్‎లకే పరిమితం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.