
న్యూఢిల్లీ/పాట్నా: బిహార్లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోవడానికి రుతుపవనాల ప్రభావంతో వానలు ఎక్కువ పడడమే కారణమని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ అన్నారు. గత 17 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 బ్రిడ్జిలు కుప్పకూలాయి. దీంతో ప్రభుత్వంపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మాంఝీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది వానాకాలం. రాష్ట్రంలో అసాధారణమైన వర్షాలు పడ్డాయి. వంతెనలు కూలిపోవడానికి ఇదే కారణం.
అయితే రాష్ట్ర సీఎం నితీశ్ ఎంక్వైరీ పట్ల చాలా నిశితంగా ఉన్నారు. గురువారం ఆయన ఈ విషయంపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. బ్రిడ్జిలు కూలిపోవడం వెనక ఎలాంటి నిర్లక్ష్యం ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు”అని మాంఝి అన్నారు. రాష్ట్రంలో వరుసగా వంతెనలు కుప్పకూలుతున్న నేపథ్యంలో వెంటనే రాష్ట్రంలోని అన్ని పాత బ్రిడ్జిలపై సర్వే నిర్వహించి, రిపేర్లు అవసరమయ్యే వాటిని గుర్తించాలని రోడ్డు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్(ఆర్సీడీ), రూరల్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (ఆర్డబ్ల్యూడీ)ను సీఎం నితీశ్ కుమార్ ఆదేశించారు. మరోవైపు.. వరుసగా బ్రిడ్జిలు కూలిపోతుండడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలోని అన్ని వంతెనల పరిస్థితిపై ఆడిట్ నిర్వహించేలా బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని అందులో కోరారు.
16 మంది ఇంజినీర్ల సస్పెన్షన్
వరుసగా వంతెనలు కూలిపోవడంపై బిహార్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్కు చెందిన 16 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. బిహార్ డెవలప్మెంట్ సెక్రటరి చైతన్య ప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వంతెనల నిర్మాణంలో నిర్లక్ష్యం ఉంటే బాధ్యులైన కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకుంటామని, వారితోనే కొత్తగా మళ్లీ కట్టిపిస్తామని అన్నారు.