శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా

శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా

2014లో జరిగిన అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌జేడీ నేత, బిహార్‌ మంత్రి కార్తీకేయ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రిజైనింగ్ లెటర్ ను సీఎం నితీష్ కుమార్ కు పంపగా ఆయన ఆమోదించి గవర్నర్ కు పంపారు. ఇంతకీ మంత్రి కార్తీకేయ సింగ్ ఎందుకు రాజీనామా చేశారన్న విషయానికొస్తే... కిడ్నాప్‌ ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆయన్ను ఎప్పట్నుంచో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే బిహార్‌ న్యాయ శాఖ మంత్రిగా ఉన్న కార్తీకేయను ఇటీవలే చెరుకు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు మార్చారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం, రాజీనామా లేఖను నితీశ్ కుమార్ గవర్నర్‌కు పంపడం చకచకా జరిగిపోయాయి

ఇక బిహార్‌లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రి వర్గ ఏర్పాటులో భాగంగా కార్తీకేయకు న్యాయ శాఖను కేటాయించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కడంపై నితీష్‌ కుమార్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. కార్తీకేయ సింగ్ రాజీనామా చేసిన వెంటనే బిహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ స్పందించారు. ఫస్ట్ వికెట్ పడిందని, మరిన్ని వికెట్లు పడడం ఖాయమని ట్వీట్ చేశారు