
అచ్చంపేట, వెలుగు: సైబర్ క్రైమ్ కేసు నేపథ్యంలో బిహార్ పోలీసుల ఎంక్వైరీ నాగర్ కర్నూల్జిల్లాలో కలకలం రేపింది. ఎస్ఐ విజయ్ భాస్కర్ తెలిపిన ప్రకారం.. అచ్చంపేట టౌన్ కు చెందిన దొంగరి వెంకటరమణ శ్రీ బాలాజీ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతని కొడుకు అనిరుధ్ఉన్నత విద్య పూర్తి చేసి హైదరాబాద్లోని పలు ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తూ సైబర్ క్రైమ్ టెక్నాలజీపై పట్టు సాధించాడు. కాగా.. బిహార్ కు చెందిన పలువురి అకౌంట్ల నుంచి తండ్రి వెంకటరమణ, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన అతని భార్య అకౌంట్కు దాదాపు రూ.2 కోట్లు మళ్లించినట్లు కేసు నమోదైంది.
విచారణలో భాగంగా శుక్రవారం బిహార్ పోలీసులు అచ్చంపేటకు వచ్చి వెంకట రమణ మెడికల్ షాపు, ఇల్లు, బంధువుల ఇండ్లలో తనిఖీలు చేశారు. గతంలోనూ చెన్నై , బెంగళూరు పోలీసులు సైతం అచ్చంపేటకు వచ్చి విచారణ చేపట్టినట్లు తెలిసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురి అకౌంట్ల నుంచి దాదాపు రూ.9 కోట్ల వరకు కాజేసినట్లు.. అనిరుధ్కోసం వెతకగా ఆచూకీ దొరకలేదని ఎస్ఐ తెలిపారు.