
న్యూఢిల్లీ: బీహర్‌లో ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో ఆధార్‌ను చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంగా పరిగణించాల్సిందేనని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సర్ డ్రైవ్‌లో ఓటర్ గుర్తింపు కోసం ఆధార్‌ను 12వ గుర్తింపు పత్రంగా స్వీకరించాలని ఈసీకి సూచించింది. అయితే, ఆధార్ కార్డు పౌరసత్వ రుజువుగా మాత్రం పనిచేయదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్ ప్రక్రియలో ఆధార్ కేవలం ఓటర్ గుర్తింపు పత్రంగా మాత్రమే పని చేస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) డ్రైవ్ చేపట్టింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటరు జాబితాలను సమగ్రంగా సవరించడానికి, నవీకరించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక ప్రక్రియ. సర్ ముఖ్య ఉద్దేశ్యం ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దడం, కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన లేదా నియోజకవర్గం మారిన ఓటర్ల పేర్లను తొలగించడం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ఓటర్లు తమ గుర్తింపు కోసం సర్ ఫారమ్‌తో పాటు 11 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి అధికారులకు సమర్పించాలి.
ఈ 11 గుర్తింపు పత్రాల్లో డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ వంటి పత్రాలు ఉండగా.. ఇందులో ఆధార్ కార్డును చేర్చలేదు ఎన్నికల సంఘం. గుర్తింపు పత్రాల్లో ఈసీ ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సోమవారం (సెప్టెంబర్ 8) న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
►ALSO READ | అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సీఎం గుడ్ న్యూస్.. భారీగా వేతనాలు పెంపు
సర్ ప్రక్రియలో ఆధార్ కార్డును 12వ గుర్తింపు పత్రంగా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. అయితే.. ఆధార్ కార్డు పౌరసత్వ రుజువుగా పనిచేయదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటర్లు సమర్పించిన ఆధార్ కార్డులు నకిలీవి కాదని నిర్ధారించుకోవడానికి వాటి వాస్తవికతను ఈపీ పరిశీలించవచ్చని పేర్కొంది. అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో చేర్చాలని ఎవరూ పోల్స్ సంస్థను కోరుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది.
గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సర్ డ్రైవ్‌లో ఓటర్ల నుంచి ఆధార్ కార్డులను స్వీకరించనందుకు అధికారులకు జారీ చేసిన షో-కాజ్ నోటీసులపై సుప్రీంకోర్టు ఈసీఐ నుంచి వివరణ కోరింది. ఈసీఐ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది మాట్లాడుతూ.. ఆధార్ సమర్పించకుండాఈసీని ఎవరినీ నిరోధించలేదని తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగిందో తెలుసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం ఈ పిటిషన్లపై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.