అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సీఎం గుడ్ న్యూస్.. భారీగా వేతనాలు పెంపు

అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సీఎం గుడ్ న్యూస్.. భారీగా వేతనాలు పెంపు

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సీఎం నితీష్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు భారీగా పెంచుతున్నట్లు ప్రకటించారు. అంగన్‌వాడీ కార్యకర్తల నెలవారీ జీతం రూ.7 వేల నుంచి రూ.9 వేలకు, హెల్పర్ల జీతాన్ని రూ.4 వేల నుంచి రూ.4,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. వేతనాల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. 

సీఎం నితీష్ కుమార్ ఆదేశాల మేరకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం బీహార్‎లోని 1.14 లక్షల మంది అంగన్‌వాడీ సిబ్బందికి ప్రయోజనం చేకూరుస్తుంది. అంగన్‌వాడీ సిబ్బంది గౌరవ వేతనం పెంపుతో పాటు రాష్ట్రంలోని ఆశా కార్యకర్తల జీతాలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం నితీష్ కుమార్. 

ఆశా కార్మికుల వేతనం రూ. 1,000 నుంచి రూ. 3,000 హైక్ చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం, జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ కొనియాడారు. అంగన్‎వాడీ సిబ్బందికి గౌరవ వేతనాల పెంపు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాగా, ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల ముందు సీఎం నితీష్ కుమార్ వరాల జల్లు కురిపిస్తున్నారు.