అప్పాజంక్షన్ నుంచి.. హైవేకు లైన్ క్లియర్

అప్పాజంక్షన్ నుంచి.. హైవేకు లైన్ క్లియర్
  • క్యాంపు ఆఫీస్​లో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెల్లడి

చేవెళ్ల, వెలుగు:  బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు అడ్డంకులు తొలగాయని, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 70 కి.మీ.  నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 

ప్రభుత్వం రూ.1,000 కోట్లతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని,  అయితే, పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో  పిటిషన్ కారణంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు. శుక్రవారం    చెన్నై కోర్టులో జరిగిన విచారణలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా  950 చెట్లలో 150 మాత్రమే తొలగించి, మిగతావి ఇతర ప్రాంతాల్లో నాటే ప్రతిపాదన చేయగా..  పిటిషనర్లు దీన్ని అంగీకరించడంతో స్టే ఆర్డర్ ఎత్తివేయగా, పనులకు అనుమతి లభించిందని వివరించారు.

  ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన  అధికారులను తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించినట్టు తెలిపారు.  శుక్రవారమే కాంట్రాక్టర్ సంస్థ పనులు మొదలుపెట్టిందని వారు తెలిపారు. అలాగే వికారాబాద్ నుంచి మహబూబ్​ నగర్ వరకు రైల్వే లైన్ కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యేలు రాంమోహ్మన్​రెడ్డి, కాలె యాదయ్య  తెలిపారు.