తాళం మరిచారా? బైక్ గోవిందా!

తాళం మరిచారా? బైక్ గోవిందా!

హనుమకొండ, వెలుగు: హ్యాండిల్ లాక్  వేయని బైక్​లను చోరీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను వరంగల్ టాస్క్​ ఫోర్స్, స్టేషన్​ ఘన్​పూర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 12 బైకులు, మూడు సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి మంగళవారం వెల్లడించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఉడట హరీశ్,  రాయపర్తికి చెందిన వొల్లెల సుధాకర్, బొమ్మెర కిరణ్ ముగ్గురు దోస్తులు. వీరు జల్సాలకు అలవాటుపడి బైక్​ చోరీలు మొదలుపెట్టారు. హరీశ్ ​గత నెలలో స్టేషన్ ఘన్​ పూర్ పరిధిలో నాలుగు.. పాలకుర్తి, మాదాపూర్ స్టేషన్ల పరిధిలో రెండు, సుబేదారి, జీఆర్పీ కాజీపేట, భువనగిరి స్టేషన్ల పరిధిలో ఒక్కో బైక్ చోరీ చేశాడు.

వీటిని కిరణ్, సుధాకర్ మార్కెట్​లో అమ్మకానికి పెట్టేవారు. ఇలా చీకటి దందా సాగిస్తుండగా.. వరంగల్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిందితుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం నెంబర్ ​ప్లేట్​ లేని బండిపై వస్తుండగా.. స్టేషన్​ ఘన్​ పూర్​ పోలీసులు పట్టుకుని విచారించారు. దీంతో అసలు నిజాన్ని నిందితులు ఒప్పుకోగా.. వారి ఇండ్లలో తనిఖీలు చేపట్టి చోరీ చేసిన బైకులను స్వాధీనం చేసుకున్నారు.  టాస్క్ ఫోర్స్ అడిషనల్​ డీసీపీ  వైభవ్ గైక్వాడ్,  ఏసీపీ జితేందర్ రెడ్డి, సీఐలు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్సై  లవన్​ కుమార్ ను సీపీ డా.తరుణ్​ జోషి అభినందించారు.