లొంగిపోయేందుకు టైమ్ ఇవ్వండి .. సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో కేసు దోషుల పిటిషన్

లొంగిపోయేందుకు టైమ్ ఇవ్వండి ..  సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో కేసు దోషుల పిటిషన్

న్యూఢిల్లీ:  బిల్కిస్ బానో అత్యాచార  కేసు దోషులలో 10 మంది తిరిగి జైలులో లొంగిపోవడానికి గడువు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల వివాహాలు, పంట కోతలు వంటి కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయని.. వాటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకొని లొంగిపోతామని గురువారం పిటిషన్ దాఖలు చేశారు. కేసులో 11 మంది దోషులుగా ఉండగా, 10 మంది తరఫున సీనియర్ లాయర్ చిదంబరేశ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. లొంగిపోవడానికి ఆదివారమే(21వ తేదీ) చివరి రోజు కావడంతో అత్యవసరంగా విచారణ చేపట్టాలని జస్టిస్ బి. నాగరత్న బెంచ్​ను కోరారు.  

దీంతో పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు బెంచ్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్​ డీవై చంద్రచూడ్‌‌‌‌ నుంచి ఉత్తర్వులు కోరాలని రిజిస్ట్రీని జస్టిస్ నాగరత్న ఆదేశించారు. కాగా, ముసలి తల్లిదండ్రులను చూసుకోవాల్సి ఉందని గోవింద్ భాయ్ అనే దోషి పిటిషన్ లో పేర్కొన్నారు. తాను ఆస్తమాతో బాధపడుతున్నానని.. ఆపరేషన్​ జరిగిందన్నారు. మరో దోషి రమేశ్ చందనా.. తన కొడుకు పెండ్లి ఉందని, లొంగిపోయేందుకు ఆరు వారాల గడువు కావాలని కోరారు. పొలంలో పంట కోతకు సిద్ధంగా ఉందని ఆ పనులు పూర్తి చేసేందుకు ఆరు వారాల గడువు కావాలని ఇంకో దోషి మితేష్ చిమన్​లాల్ భట్ పిటిషన్​లో పేర్కొన్నారు.