యాక్సిడెంట్​ చేసి పారిపోతే.. పదేండ్ల జైలు శిక్ష

యాక్సిడెంట్​ చేసి పారిపోతే.. పదేండ్ల జైలు శిక్ష

హిట్  అండ్  రన్  కేసులకు కళ్లెం వేయాలని కేంద్రం నిర్ణయించింది. ర్యాష్​  డ్రైవింగ్  చేసి ఎవరైనా వ్యక్తి మరణానికి కారణమై ఘటనా స్థలం నుంచి పారిపోయినా లేదా యాక్సిడెంట్  వార్తను పోలీసులకు తెలపకపోయినా బాధ్యులకు  గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష వేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ర్యాష్​ డ్రైవింగ్  వల్ల ప్రమాదం జరిగినప్పుడు పోలీసులకు రిపోర్ట్​ చేస్తే శిక్షను మూడేండ్లు తగ్గించి ఏడేండ్లు విధిస్తారు.

న్యూఢిల్లీ: హిట్  అండ్  రన్  కేసులకు కళ్లెం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాక్సిడెంట్ చేసి పారిపోయినా (హిట్  అండ్  రన్), ప్రమాదం గురించి పోలీసులకు తెలపకపోయినా గరిష్టంగా పదేళ్లు జైలుశిక్ష వేయాలని కేంద్రం ప్రతిపాదించింది. క్రిమినల్  చట్టాలను సమూలంగా మార్చే క్రమంలో తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత బిల్లులో ఈ శిక్షలను పొందుపరిచింది. హిట్ అండ్  రన్  కేసులకు గరిష్టంగా పదేళ్లు జైలుశిక్ష విధించేలా మార్పులు ప్రతిపాదించింది. సెక్షన్  104 (2) ప్రకారం ర్యాష్​  డ్రైవింగ్  చేసి (చంపాలన్న ఉద్దేశం లేకపోయినా) ఎవరైనా వ్యక్తి మరణానికి కారణమై ఘటనా స్థలం నుంచి పారిపోయినా లేదా యాక్సిడెంట్  వార్తను పోలీసులకు తెలపకపోయినా బాధ్యులకు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అలాగే సెక్షన్  104(1) ప్రకారం రాష్ డ్రైవింగ్​ వల్ల ప్రమాదం జరిగినపుడు పోలీసులకు రిపోర్టు చేస్తే గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్షతో పాటు ఫైన్ విధించే అవకాశం ఉంది.  

2021లో ప్రమాదాల్లో 1.54 లక్షల మంది మృతి

2021లో రోడ్డు ప్రమాదాల్లో 1.54 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డురవాణా హైవేల మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే 3.84 లక్షల మంది గాయపడ్డారని ఆ శాఖ వెల్లడించింది. 2021 క్యాలెండర్  ఇయర్ లో మొత్తం 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయని పేర్కొంది. 2019 ఏడాదితో పోలిస్తే, 2021లో జరిగిన రోడ్  యాక్సిడెంట్లు 8.1 తగ్గాయి. అలాగే గాయపడిన వారి సంఖ్య కూడా 14.8 శాతం తగ్గింది. మరణాలు మాత్రం 1.9 శాతం పెరిగాయి.

లైంగిక దోపిడీకి పదేళ్లు శిక్ష..

వ్యక్తిగత గుర్తింపును దాచి మహిళలను పెళ్లి చేసుకున్నా, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొని మోసం చేసినా, పెళ్లి చేసుకుంటానని, ప్రమోషన్  లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి లైంగిక సంబంధం నెరిపితే గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. ‘‘పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మహిళను లోబరుచుకోవడం నేరం. అటువంటి నేరాలకు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా పడుతుంది” అని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వెల్లడించారు. బాధ్యులపై వేగంగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం అందించడమే కొత్త బిల్లు ఉద్దేశమని షా చెప్పారు. 

గ్యాంగ్  రేప్  కేసుల్లో 20 ఏళ్ల జైలు.. 

అత్యాచార కేసుల్లో బాధితురాలు చనిపోయినా లేదా కోమాలోకి వెళ్లినా.. దోషులకు 20 ఏళ్లకు తక్కువ కాకుండా కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో ఆ శిక్షను జీవిత ఖైదు లేదా మరణశిక్షగా కూడా మార్చవచ్చు. 12 ఏళ్లలోపు తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారం చేస్తే 20 ఏండ్లు కఠిన కారాగార శిక్ష పడుతుంది.