Elon Musk: సారీ ప్రెసిడెంట్ ట్రంప్..! ఎలాన్ మస్క్ పశ్చాత్తాపం..

Elon Musk: సారీ ప్రెసిడెంట్ ట్రంప్..! ఎలాన్ మస్క్ పశ్చాత్తాపం..

Trump Vs Elon Musk: అమెరికాలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ట్రంప్, ఎలాన్ మస్క్ ఉన్నారు. వ్యక్తిగతంగా వీరిద్దరూ వ్యాపారవేత్తలే. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ముందు నుంచి ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మస్క్ డబ్బు నుంచి టెక్నాలజీ వరకు అన్ని విధాలుగా సహాయం అందించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే వారి స్నేహానికి బీటలు వారిన సంగతి తెలిసిందే. 

ట్రంప్ తీసుకొచ్చిన కొత్త టాక్స్ బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. డోజీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మస్క్ తన ఎక్స్ ఖాతాలో ట్రంప్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పుట్టుక అవసరం అనేదానిపై పోల్ కూడా నిర్వహించారు. ఇదంతా చూస్తుంటే బిలియనీర్ కొత్త రాజకీయ పార్టీతో ట్రంప్ పై దండెత్తుతారా అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. 

 

కానీ ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నట్లు తెలుస్తోంది. గతవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై చేసిన కొన్ని కామెంట్స్ మస్క్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై మస్క్ ఒక ఆసక్తికర పోస్టును తన ఎక్స్ ఖాతాలో ఉంచారు. ఈ పోస్టులో తాను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై గతవారం చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు చాలా దూరం వెళ్లాయంటూ పోస్టులో పేర్కొన్నారు. 

అయితే గతవారం మస్క్ వ్యాఖ్యలపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ మాత్రం కూల్ సమాధానాలు ఇచ్చారు. అన్నీ తెలిసి కూడా మస్క్ ఎందుకిలా చేస్తున్నాడో తనకు అర్థం కావటం లేదన్న ట్రంప్.. మస్క్ మైండ్ చెడిపోయిందంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాన్ మస్క్ తండ్రి కూడా ఈ విషయంపై స్పందిస్తూ మస్క్ ఇందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలియటం లేదని అన్నారు.