ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్  ఝున్‌ ఝున్‌ వాలా మృతి

ప్రముఖ వ్యాపారవేత్త  రాకేశ్  ఝున్‌ ఝున్‌ వాలా మృతి

భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది.ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్  ఝున్‌ ఝున్‌వాలా (62) కన్నుమూశారు. ఇవాళ ఉదయం 6:45 నిమిషాలకు ఆయన కు గుండె పోటు వచ్చింది. దీంతో  అప్రమత‍్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.  గత కొంత కాలంగా  రాకేశ్  ఝున్‌ ఝున్‌వాలా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్‌ హాస్పిటల్‌లో చేరారు. వారం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా జులై 5,1960లో హైదరాబాద్ లో ఓ మధ్యతరగతి కుటుంబంలో  జన్మించారు. ఆయనకు  చిన్న తనం నుంచే వ్యాపారం అంటే మక్కువ. అందుకే కాలేజీ విద్యార్ధిగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.ఓ వైపు సీఏ(చార్టర్డ్ అకౌంటెంట్‌) చదువు కుంటూనే స్టాక్‌ మార్కెట్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. అలా 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్‌ మార్కెటర్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు.  ఫోర్బ్స్ అంచనా ప్రకారం అతని నికర ఆస్థి విలువ రూ.5.5 బిలియన్లుగా ఉంది. వ్యాపార వేత్త  అయిన రేఖను ఝున్‌ఝున్‌వాలా వివాహం చేసుకున్నారు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఈనెల 7న ఆకాశ ఎయిర్‌తో  ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన పెట్టుబడిదారుడిగానే కాదు.. ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్నారు.

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 1986లో టాటా టీ షేర్‌లను కొనుగోలు చేయడం ద్వారా తాను మొదటి సారి భారీ లాభాలను ఆర్జించారు. అతను టాటా టీ యొక్క 5,000 షేర్లను కేవలం 43 రూపాయలకు కొనుగోలు చేశారు. తరువాత మూడు నెలల్లో ఆ స్టాక్ 143 రూపాయలకు పెరిగింది. అతను మూడు రెట్లు ఎక్కువ లాభం పొందాడు. ఆ తర్వాత మూడేండ్లలో ఝున్‌జున్‌వాలా రూ.20 నుంచి 25 లక్షలు సంపాదించారు. ఆయన్ని అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారునిగా బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ రూ. 45 వేల కోట్లుగా ఉంది.

రాకేశ్ ఝున్‌ ఝున్‌వాలా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.  ఝున్‌ఝున్‌వాలా అలుపెరగని వ్యక్తి అని..ఆర్థిక ప్రపంచానికి చెరగని సహకారాన్ని అందించారన్నారు. ఆయన మరణం బాధాకరమని... అతని కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుభూతి తెలుపుతూ ఓం శాంతి అని ట్వీట్ చేశారు.

రాకేశ్ ఝున్‌ ఝున్‌వాలా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.  కోట్లాది మందికి సంపద సృష్టికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన కుటుంబ సభ్యులు,స్నేహితులకు, అభిమానులకు సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.