
కరీంనగర్ జిల్లాలో ఐదోవిడత పల్లెప్రగతికి అధికారులు సిద్ధమవుతున్నా... సర్పంచుల నిరసనలు వారిని కలవరపెడుతున్నాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు చేల్లించాలంటూ పల్లెప్రగతి అవగాహన సదస్సులను సర్పంచులు ఎక్కడికక్కడ బహిష్కరించారు. దీంతో.. మంత్రి గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు సర్పంచులతో మట్లాడుతున్నారు. బిల్లులు రిలీజ్ చేస్తామని పల్లెప్రగతిలో పాల్గొనాలని బుజ్జగిస్తున్నట్లు సమాచారం. సర్పంచుల నుంచి పల్లెప్రగతి పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో... వాటిని విడుదల చేస్తేనే పల్లె ప్రగతిలో పాల్గొంటామంటూ సొంతపార్టీ సర్పంచులే నిరసన గళం వినిపిస్తున్నారు. పల్లెప్రగతిలో సర్పంచులు పాల్గొంటారా లేదా అన్న టెన్షన్ అటు అధికారులను, ఇటు ప్రభుత్వ పెద్దలను వేధిస్తోంది. ఇప్పటికే తిమ్మాపూర్, రామడుగు, హుజురాబాద్, శంకరపట్నం, ఇల్లందకుంట మండలాల్లో సర్పంచులు బహిరంగంగానే ప్రభుత్వతీరును నిరసిస్తూ సమావేశాలను భాయ్ కాట్ చేసారు.
ఈవిషయంలో ఇప్పటికే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీశ్ రావు రంగంలోకి దిగి సర్పంచులను బుజ్జగిస్తున్నారు. సర్పంచులకు రావాల్సిన బిల్లులన్నీ మంజూరు చేస్తామని.. ప్రతి ఒక్కరూ పల్లెప్రగతిలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పల్లెప్రగతి, పట్టణప్రగతిలో సాధించాల్సిన లక్ష్యాలు కూడా నిర్ణయించారు. ఇవన్నీ పూర్తి చేసే విధంగా అధికారులను సమాయత్తం చేసారు. ఒకవేళ సర్పంచులు సహకరించకపోయినా... సిబ్బంది, ఎంపీటీసీల సహకారంతో పూర్తి చేయించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. పల్లె -పట్టణ ప్రగతిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వచ్చేది వర్షాకాలం కావడంతో వాననీరు నిలువ ఉండకుండా చూడటం, చెత్త తొలగింపు, పిచ్చి మొక్కలు తీసేసి డ్రైనేజీలు శుభ్రం చేయడం, ఖాళీ స్థలాల్లో గుంతలుంటే పూడ్చివేయడం లాంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారుల కృషి మంచి ఫలితాలు సాధించామని మోటివేట్ చేస్తున్నారు మంత్రి గంగుల, బోయినపల్లి వినోద్. క్రీడా ప్రాంగణాలకు ఈసారి పల్లె, పట్టణ ప్రగతిల్లో అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.కరీంనగర్ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కూడా ఈసారి పట్టణ ప్రగతి కింద పూర్తి స్థాయిలో పనులు చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో నాలుగో విడత పట్టణ ప్రగతిలో చేపట్టిన డ్రైనేజీలు పూర్తి చేయడం, వర్షాకాలంలో వరద ముంపు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. చొప్పదండి, కొత్తపల్లి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లోనూ ప్రజల అవసరాలను గుర్తించి పట్టణ ప్రగతి పనులు చేపడుతామన్నారు. లక్ష్యాలు ఘనంగా ఉన్నా... సర్పంచుల నుంచి అసంతృప్తి ప్రభావంతో పల్లెప్రగతి కార్యక్రమాలపై పడుతుందన్న టెన్షన్ సర్కారుకు నిద్రపట్టనీయకుండా చేస్తోంది.