గూగుల్​ మ్యాప్స్.. మనకు ఫోన్లలో.. పక్షులకు బ్రెయిన్​లో

గూగుల్​ మ్యాప్స్.. మనకు ఫోన్లలో.. పక్షులకు బ్రెయిన్​లో

గూగుల్​ మ్యాప్స్​.. ఈ పదం తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. స్మార్ట్ ఫోన్​ ఉన్న ప్రతి ఒక్కరికీ దీని ఉపయోగాలు తెలిసే ఉంటాయి. వీటి సాయంతో ఎక్కడికి వెళ్లాలన్నా మ్యాప్​ పెట్టుకుని వెళ్తే చాలు. ఇలా చేసేందుకు ఉపయోగ పడేది మాత్రం గ్లోబల్​ పొజీషనింగ్​ సిస్టం. దాన్నే జీపీఎస్​ అంటాం. మరి పక్షుల మెదళ్లలో జీపీఎస్​లా పని చేసే వ్యవస్థ ఉంటుందని తెలుసా.  నిజమేనండీ ఇది చెబుతున్నది శాస్ర్తవేత్తలే.. ఆ వివరాలేంటో చూద్దాం పదండీ.. 
జీపీఎస్ మానవ సృష్టి.  దీన్ని ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.

కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిపై నివిసిస్తున్న కొన్ని జీవుల్లో ఈ టెక్నాలజీ సహజంగానే ఉందని తేలింది.  ముఖ్యంగా వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించే వలస పక్షుల మెదళ్లలో జీపీఎస్‌లాంటి వ్యవస్థ సహజంగానే ఉందని కెనడాలోని వెస్టర్న్‌ ఒంటారియో యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. భూ అయస్కాంత క్షేత్రమే సౌర గాలులు, ఇతర ప్రమాదకర కిరణాల నుంచి భూమిపై సకల జీవకోటికి రక్షణ ఇస్తోంది. పక్షుల మెదళ్లలోని జీపీఎస్‌కు కూడా ఈ అయస్కాంత క్షేత్రమే కారణమని పరిశోధకులు గుర్తించారు. 

జీపీఎస్​ని ఆన్.. ఆఫ్​చేసుకుంటాయ్​..

ఫోన్లలో జీపీఎస్‌ అవసరాన్ని బట్టి ఆన్‌.. ఆఫ్‌ చేసుకున్నట్టే పక్షులు కూడా ఆన్‌.. ఆఫ్‌ చేసుకుంటున్నాయని యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూరో సైన్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో మెడలీనా బ్రాడ్‌బెక్‌ తెలిపారు. పక్షుల మెదళ్లలోనే సహజంగా ఈ వ్యవస్థ అభివృద్ధి చెందిందని గుర్తించారు.