మోకాళ్లపై బిర్లా మందిర్ మెట్లెక్కి.. ఉద్యమ కళాకారుల నిరసన

మోకాళ్లపై బిర్లా మందిర్ మెట్లెక్కి.. ఉద్యమ కళాకారుల నిరసన
  • సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్​

బషీర్ బాగ్, వెలుగు: సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. తమ పట్ల సీఎం కేసీఆర్​వైఖరి మారాలని కోరుతూ మంగళవారం మోకాళ్లపై బిర్లా మందిర్ మెట్లెక్కి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జోలె పట్టి ఆలయ ప్రాంగణంలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 350 మంది ఉద్యమ కళాకారులు తొమ్మిదేండ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబురాలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి తాము కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఐదు రోజులుగా రూ.5 భోజనం తింటూ.. సిటీ రోడ్ల వెంట పడుకుంటున్నామని వాపోయారు.

 తమ పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తమకు ఉద్యోగాలు రానివ్వకుండా అడ్డుపడుతున్న తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సంబంధిత శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పదవుల నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారులు అనబోతు వెంకటేశ్ చారి, నరేశ్, మద్దెల నాగార్జున, మహ్మద్ అహ్మద్, యుగేందర్, కవిత, కొండ్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు