
తనలో ఓ గ్లామర్ క్వీన్ ఉంది.. ఒక డ్యాన్సింగ్ స్టార్ ఉంది.. వంక పెట్టలేని నటీమణి ఉంది. కానీ అది గుర్తించడానికి ఇండస్ట్రీకి చాలా కాలమే పట్టింది. నీలో ఏముందని హీరోయిన్ అవ్వడానికి అన్నారు. నీలాంటి వాళ్లు ఇక్కడ నిలబడటం కష్టమే అని వెనక్కి తోశారు. కష్టపడింది. ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు.. ఒక్కో సినిమా చేసి తనని తాను నిరూపించుకుంటూ వచ్చింది. అవమానాలు ఎదురయ్యాయి. పరాజయాలు పలకరించాయి. ముందేం చెప్పాం అంటూ ఓవైపు వెక్కిరింపులు. ఐరన్ లెగ్ అంటూ మరోవైపు బాధపెట్టే ముద్రలు.కుంగిపోలేదు. కుమిలిపోలేదు. పడిన ప్రతిసారీ పైకి లేచింది. ఫెయిల్యూర్స్ ను సక్సెస్ గా మార్చుకోవడం ఎలాగో చూపించింది. చో రామస్వామి బంధువు కావడంతో చిన్ననాటనే సినీ రంగానికి బాట పడింది. బేసిగ్ గా తమిళియన్ కావడంతో కోలీవుడ్‌లోనే మొదటిసారి కెమెరా ముందు నిలబడింది. ఆ తర్వాత ‘భలేమిత్రులు’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆపైన మలయాళ, కన్నడ, హిందీ భాషల వైపూ అడుగేసింది.
మొదట్లో అవకాశాలు వరుసగా వచ్చినా.. అపజయాలు కంగారు పెట్టాయి. ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. అవన్నీ ఆమె విజయానికి సోపానాలు అయ్యాయి. ‘సూత్రధారులు’ చిత్రంతో బ్రేక్ వచ్చింది. ‘అల్లుడుగారు’ సినిమాతో బెస్ట్ అనిపించుకుంది. ‘నీలాంబరి’గా ఎదురులేదని నిరూపించుకుంది. ‘శివగామి’గా సంచలనం సృష్టించింది. రెండు వందల అరవైకి పైగా చిత్రాల్లో ఎన్నెన్నో పాత్రలు. ఐదు భాషల్లో ఎన్నో రికార్డులూ రివార్డులూ. చేయని పాత్ర లేదు. చేతకాదని దేన్నీ వదిలేసిన దాఖలాలు లేవు. వచ్చిన ప్రతి మంచి అవకాశాన్నీ అందిపుచ్చుకుని అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. నవ్వించింది. ఏడిపించింది. గ్లామర్‌తో కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసింది. నటనతో అందరినీ కట్టి పడేసింది. పాజిటివ్ రోల్స్ చేస్తే ఎంత ఉదాత్తంగా ఉంటుందో.. నెగిటివ్ రోల్స్ చేస్తే అంతగా వణికిస్తుంది.
హీరోయిన్గా మొదటి ఇన్నింగ్స్ లోనే మెస్మరైజ్ చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటుతోంది. అమ్మ పాత్రలో కమ్మదనాన్ని చూపిస్తుంది. అత్తగారిగా గడుసుతనాన్ని ప్రదర్శిస్తుంది. ఏం చేసినా తనకు తనే సాటి అనిపించుకుంటుంది. ఎందుకంటే ఆమె రమ్యకృష్ణ. ఏదైనా చేయగలదు. ఎంత బెస్ట్ అయినా ఇవ్వగలదు. అందుకేగా ‘శివగామి’గా రాజమౌళికి బెస్ట్ చాయిస్ అయ్యింది! మొన్నటికి మొన్న జయలలిత పాత్రలో ‘క్వీన్’లా మెరిసింది! మరిన్ని సంవత్సరాలు ఇలాగే విజయవంతంగా కొనసాగాలని.. ఎన్నెన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించాలని కోరుకుంటూ.. రమ్యకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు.