పాతిక సినిమాలు చేయలేదు కానీ అతనేంటో ప్రపంచానికి తెలుసు

 పాతిక సినిమాలు చేయలేదు కానీ అతనేంటో ప్రపంచానికి తెలుసు
  • వెరైటీ లుక్స్.. డిఫరెంట్ థాట్స్.. బ్లాక్ బస్టర్ మూవీస్.. ద బెస్ట్ అనిపించే క్యారెక్టర్స్..
  • కెరీర్‌‌ పరంగా ఇదీ రణ్‌వీర్ సింగ్. 
  • రణ్‌వీర్‌‌ అంటే వేగం. రణ్‌వీర్ అంటే ఎనర్జీ. రణ్‌వీర్ అంటే జోష్. రణ్‌వీర్‌‌ అన్నింట్లో భేష్.
  • వ్యక్తిగా ఇదీ అతనికి అందరూ ఇచ్చే నిర్వచనం.
  • ఇంకా పాతిక సినిమాలు కూడా చేయలేదు. కానీ అతని గురించి దేశంలో తెలియనివారంటూ లేరు.
  • రైటర్‌‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. యాక్టర్‌‌గా చక్రం తిప్పుతున్న ఈ ఎనర్జిటిక్ హీరో బర్త్ డే ఈ రోజు.
  • ఈ సందర్భంగా తన గురించి అందరికీ అంతగా తెలియని కొన్ని ఇంటరెస్టింగ్‌ విషయాలు..

1985లో ముంబైలో సెటిలైన సింధీ ఫ్యామిలీలో పుట్టాడు రణ్‌వీర్. పూర్తి పేరు రణ్‌వీర్ సింగ్ భవనానీ. కానీ అంత పొడవైన పేరు ఇష్టం లేక తన పేరు నుంచి భవనానీని తప్పించేశాడు. నటనంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. స్కూల్లో డ్రామాస్, డిబేట్స్లో పాల్గొనేవాడు. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని తెలుసుకుని చదువుపై దృష్టి పెట్టాడు. యూఎస్‌ వెళ్లి కాపీ రైటింగ్‌లో బ్యాచిలర్‌‌ డిగ్రీ పూర్తి చేశాడు. యాక్టింగ్‌లోనూ కోర్స్ చేశాడు. తిరికొచ్చాక అడ్వర్టయిజింగ్ కంపెనీస్‌కి కాపీరైటర్‌‌గా పని చేయడం మొదలుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌‌గానూ వర్క్ చేశాడు. కానీ మనసు నటనపైనే ఉండటంతో డైరెక్టర్లకి పోర్ట్ఫోలియో పంపడం మొదలెట్టాడు.

నిజానికి రణ్‌వీర్‌‌ పెద్ద స్టార్ అవ్వాలనేది అతని గ్రాండ్ మదర్ కోరిక. ఆవిడ చిన్నప్పటి నుంచీ అమితాబ్ సినిమాలు చూపించి అతనని మోటివేట్ చేసేవారట. స్కూల్లో ఓసారి ‘దీవార్‌‌’ సినిమాలోని అమితాబ్ డైలాగ్ చెప్పి ప్రైజ్ కూడా కొట్టేశాడట రణ్‌వీర్. అయితే సినిమా పిచ్చి పెరిగిపోవడంతో టేప్ రికార్డర్ తెచ్చుకుని క్లాస్‌లో కూడా పాటలు వినేవాడట. ఓసారి ‘దిల్‌ సే’లోని ఛయ్య ఛయ్య పాట వింటూ టీచర్‌‌కి దొరికిపోవడంతో కొన్ని రోజులు స్కూల్‌ నుంచి సస్పెండ్ చేశారట. 

రణ్‌వీర్ మొదటి సినిమా యశ్‌రాజ్ ఫిల్మ్స్ వారి ‘బ్యాండ్ బాజా బారాత్’. ఓ మంచి సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశాడు రణ్‌వీర్. అంతెందుకు.. తన పాత్ర అంతగా నచ్చక మూడు బిగ్ ఫిల్మ్స్కి కూడా నో చెప్పాడు. ఎట్టకేలకి మనసుకి నచ్చిన చాన్స్ దొరికింది. మొదటి సినిమాతోనే విజయం దక్కింది. 

‘బ్యాండ్ బాజా బారాత్‌’ లోని బిట్టూశర్మ పాత్రకి ఆడిషన్ అయ్యాక రెండు వారాలకు పిలుపొచ్చింది రణ్‌వీర్‌‌కి. నవాజుద్దీన్ సిద్దిఖీతో కలిసి యాక్టింగ్ వర్క్ షాప్ నిర్వహించారు నిర్మాతలు. అయితే దానికంటే అసలు సిసలు ఢిల్లీ కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసుకోవడం బెటరనుకున్నాడు రణ్‌వీర్. ఢిల్లీ యూనివర్శిటీ క్యాంపస్‌లో బిట్టూశర్మ పేరుతో ఒక స్టూడెంట్‌లా తిరగడం మొదలుపెట్టాడు. ఒకరోజు క్లాస్‌రూమ్‌లో లెక్చెరర్ చెబుతున్నదాన్ని రికార్డు చేస్తుండగా ఆవిడ కనిపెట్టేసింది. కాస్త ఉంటే బుక్కైపోయేవాడు కానీ తెలివిగా తప్పించుకుని బయటపడ్డాడు.

తనను తాను ప్రూవ్ చేసుకోడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు రణ్‌వీర్. ప్రతి పాత్రనీ ప్రాణం పెట్టి చేశాడు. మంచి పేరు సంపాదించాడు. రామ్‌లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, సింబా, గల్లీబోయ్, సూర్యవంశీ, 83 లాంటి మంచి సినిమాలున్నాయి అతని అకౌంట్‌లో. ప్రస్తుతం సర్కస్‌, రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ సినిమాలు చేస్తున్నాడు. అమితాబ్‌ ‘డాన్‌’ మూవీ రీమేక్‌లో నటించాలనేది రణ్‌వీర్ డ్రీమ్.

‘గల్లీబోయ్‌’లో ర్యాపర్ పాత్రలో అద్భుతంగా నటించాడు రణ్‌వీర్. అంతేకాదు.. అందులోని ర్యాప్స్ అన్నీ తనే పాడాడు. ఆ సినిమా ముగిశాక సొంతగా మ్యూజిక్ లేబుల్స్ స్థాపించాడు. ర్యాప్ తనకు ప్యాషన్ అని, అలాంటివి వినడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారని, వారి ఆశను తీర్చడానికే ఈ అడుగు వేశానని రణ్‌వీర్ చెప్పాడు. అయితే ఆ ఇష్టం ఈ సినిమాతో కలగలేదు రణ్‌వీర్‌‌కి. అతని ర్యాప్ అంటే మొదట్నుంచీ ఇష్టం. ర్యాప్ సాంగ్స్ పాడే అలవాటు కూడా ఉంది. 

‘83’ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో ఇమిడిపోయి మెప్పించాడు రణ్‌వీర్ సింగ్. ఇందులో మోహీందర్ అమర్‌‌నాథ్‌ కూడా ఓ పాత్రలో నటించారు. అయితే వీళ్లిద్దరికీ గతంలోనే పరిచయం ఉంది. రణ్‌వీర్ స్కూల్ డేస్‌లో క్రికెట్ ఆడేవాడట. తన ఫ్రెండ్స్ తో  కలిసి అమర్‌‌నాథ్ దగ్గర కోచింగ్ తీసుకోవాలనుకున్నాడట. కానీ అతని ఆట తీరు చూశాక కోచింగ్ ఇవ్వడానికి అమరనాథ్ నిరాకరించారట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ సందర్భంలో రివీల్ చేశాడు. 

రణ్‌వీర్ మొదట్నుంచీ హీరో గోవిందాకి పెద్ద ఫ్యాన్. ఎంత ఇష్టమంటే.. ‘రాజా బాబూ’ సినిమా వచ్చినప్పుడు తన సెల్‌ఫోన్‌ డీపీ మార్చేసి గోవిందా స్టిల్ పెట్టుకునేంత. అంతే కాదు.. ఆ సినిమాలో పాటనే రింగ్‌టోన్‌గా కూడా పెట్టుకున్నాడట. 

 లూటేరా, గూండే, రామ్‌లీల లాంటి కొన్ని సినిమాల్లో రణ్‌వీర్ సింగ్ క్లైమాక్స్ లో చనిపోతాడు. అది అతని తల్లికి అస్సలు నచ్చలేదట. ఆ మూవీస్ చూసి అమ్మ చాలా డిస్టర్బ్ అయ్యింది కాబట్టి ‘బాజీరావ్ మస్తానీ’ మూవీ చూపించకూడదనుకున్నాడట. కానీ ఆవిడ పట్టుబట్టి సినిమా చూశారట. క్లైమాక్స్ లో  రణ్‌వీర్ చనిపోవడం చూసి చాలా ఎమోషనల్ అయ్యారట. కొడుకుని హగ్ చేసుకుని అరగంట పాటు అలానే ఉండిపోయారట. కనీసం దీపికతో నటించిన సినిమాలో అయినా చనిపోకుండా ఇద్దరి కలయితో సుఖాంతమయ్యుంటే బాగుండేదంటూ చాలా బాధపడ్డారట.  

రణ్‌వీర్‌ అనగానే అందరికీ అతను వేసుకునే డ్రెస్సులే గుర్తొస్తాయి. అందరిలో ఒకడిగా ఉండకుండా స్పెషల్‌గా కనిపించడం కోసమే అతనలా రెడీ అవుతాడట. తనకి బ్రైట్ కలర్స్ అంటే ఇష్టమట. అందుకే రంగురంగుల దుస్తులు వేసుకొస్తాడు. అంతేకాదు, తన‌కి శుభ్రం ఎక్కువ. చుట్టూ ఉన్న పరిసరాలే కాదు.. తాను కూడా ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండాలని ఫీలవుతుంటాడు. అందుకే ఎక్కడికెళ్లినా శానిటైజర్, ఐ డ్రాప్స్, మౌత్ ఫ్రెషనర్, డియోడరెంట్, పర్‌‌ఫ్యూమ్‌, చివరికి చూయింగ్‌ గమ్‌ కూడా తీసుకుపోతాడు. 

సోనమ్‌ కపూర్‌‌కి రణ్‌వీర్ సెకెండ్ కజిన్ అవుతాడు. తల్లి తరఫు చుట్టం. అతని తల్లి, సోనమ్ తల్లి సిస్టర్స్. రణ్‌వీర్ కంటే సోనమ్ కేవలం ఇరవయ్యేడు రోజులు పెద్దది. అందుకే సోనమ్‌ పెళ్లిలో రణ్‌వీర్ చాలా సందడి చేశాడు. ఓ తమ్ముడిగా తన బాధ్యతలన్నీ నిర్వర్తించాడు. 

రణ్‌వీర్‌‌కి సముద్రమంటే చాలా ఇష్టం. ఇక సినిమాలు చేయకూడదు అనుకున్నప్పుడు గోవాలాంటి ప్లేస్‌లో, సముద్రానికి అభిముఖంగా ఓ విల్లా కట్టుకుని హ్యాపీగా గడిపేయాలనేది అతని డ్రీమ్. అలాంటి ప్రశాంతత కనుక దొరికితే తనకు నచ్చినట్టు గడుపుతాడట. వంట చేస్తాడట, పెయింటింగ్స్ వేస్తాడట. యోగా చేస్తూ, సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తాడట. ఇవన్నీ రణ్‌వీర్‌‌కి ఎంతో ఇష్టమైన పనులు.

దీపిక తన లైఫ్‌లోకి రాకపోతే తాను కంప్లీట్ మేన్ అయ్యుండేవాడిని కాదు అంటుంటాడు రణ్‌వీర్. అతను దీపికా పదుకొనెని మొదటిసారి ఓ అవార్డ్ ఫంక్షన్‌లో చూశాడట. చూస్తూనే ఫ్లాట్ అయిపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆరేళ్ల డేటింగ్ తర్వాత దీపికను పెళ్లి చేసుకున్నాడు రణ్‌వీర్.

ఇలా ఎంత చెప్పుకున్నా తరగదు రణ్‌వీర్ గురించి. అతని జోరు చూస్తే జలపాతమే నడిచి వెళ్తోందా అనిపిస్తుంది.  అతని తీరు చూస్తే ఇంత కలుపుగోలుతనం ఎలా వచ్చిందో అనిపిస్తుంది. బెస్ట్ యాక్టర్‌‌గానే కాక గుడ్ పర్సన్‌గా కూడా మెప్పు పొందిన రణ్‌వీర్‌‌ మరెన్నో యేళ్లు ఇలాగే సాగిపోవాలని కోరుకుంటూ.. తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు.