నోరూరించే బిర్యానీకి స్పెషల్ డే

నోరూరించే బిర్యానీకి స్పెషల్ డే

హైదరాబాద్ అంటేనే.. బిర్యానీకి వెరీవెరీ ఫేమస్. నగరానికి వచ్చే పర్యాటకులంతా ఇక్కడి దమ్ బిర్యానీని తప్పకుండా తినాలని భావిస్తుంటారు. దీన్ని బట్టి ఇక్కడి బిర్యానీ రుచికి ఎంతటి గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే మన బిర్యానీ గురించి ఇంతలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే..  ఇవాళే (జులై 3న) ‘వరల్డ్ బిర్యానీ డే’. ఈ అమోఘమైన వంటకంతో ముడిపడిన మరిన్ని వివరాలు చూద్దాం.

బిర్యానీ రకరకాలు.. 

బిర్యానీ గురించి వినగానే నోరూరక మానదు. ఈ రుచికరమైన వంటకం ఉంటేనే స్పెషల్ అకేషన్స్ కు  పరిపూర్ణత లభిస్తుంది.  చికెన్, మటన్ నుంచి ఆలు, గుడ్డు దాకా.. వెజ్ నుంచి ఫిష్, ప్రాన్ దాకా ఎన్నెన్నో రకాల బిర్యానీలకు నేటికీ యమ క్రేజ్. వాస్తవానికి బిర్యానీలో 7 క్లాసిక్ రకాలు అందుబాటులో ఉన్నాయి. అవి.. కశ్మీరీ స్టయిల్ బిర్యానీ, మటన్ మండి బిర్యానీ, కోల్ కతా చికెన్ బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ, మలబార్ ఫిష్ బిర్యానీ, కఠాల్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ.  

బిర్యానీ పదం పుట్టుక సంగతి.. 

బిర్యానీని 16వ శతాబ్దంలో  మొఘల్ రాజులు తొలిసారిగా ఢిల్లీ నగరంలో వండించారని కొందరు అంటారు. ఈ సమాచారం తప్పని.. అంతకంటే ముందు నుంచే మన దేశంలో బిర్యానీ వంటకం అందుబాటులో ఉందని ఇంకొందరు వాదిస్తుంటారు.   ‘బిర్యానీ’ అనే పదం పర్షియన్ భాషా పదం ‘బిరింజ్’ (బియ్యం) నుంచి  పుట్టింది. పర్షియన్ భాషలో ‘బిర్యాన్’ అంటే.. వేయించడం లేదా కాల్చడం అని అర్థం.  బిర్యానీని పర్షియన్ భాషలో ‘బెరెష్తాన్’ అని కూడా పిలుస్తారు. బిర్యానీ ఎక్కడ పుట్టినా.. దానిపై చెరిగిపోని ముద్ర వేసింది మాత్రం మన హైదరాబాదే అని గట్టిగా చెప్పొచ్చు.

అత్యంత ఖరీదైన.. బిర్యానీ ధర తెలుసా ? 

ప్రపంచంలో అత్యంత ఖరీదైన బిర్యానీ ఏంటో తెలుసా ? ధర ఎంతో తెలుసా ? దుబాయ్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో ఉన్న ‘బొంబాయి బోరో’ అనే రెస్టారెంట్ లో వండే బిర్యానీ చాలా కాస్ట్ లీ. మన ఇండియాలోని నాలుగు ప్రాంతాల్లో ఫేమస్ అయిన 4 రకాల బిర్యానీలను ఈ రెస్టారెంట్లో వండుతారు. ఒక్క ప్లేట్ బిర్యానీ ధర ఇక్కడ దాదాపు 1000 దిర్హమ్ లు. ఇండియా కరెన్సీలో ఇది రూ.21వేలకు పైమాట.  అయినా అక్కడి వాళ్లు క్యూ కట్టి మరీ  తింటుంటారు. 

ప్యారడైజ్ రికార్డు.. 

స్విగ్గీ, జొమాటోల్లో రోజూ ఎక్కువగా డెలివరీ అయ్యే వంటకం ఏదైనా ఉందంటే.. అది బిర్యానీయే. హైదరాబాద్ లోని ప్యారడైజ్ బిర్యానీ ఈవిషయంలో కొత్త రికార్డు సాధించింది. ఒక ఏడాదిలో (2017) అత్యధికంగా 70 లక్షలకు పైగా బిర్యానీలను సర్వ్ చేసినందుకు ‘ప్యారడైజ్’ కు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కింది.