తమిళనాడులో గ్యాస్ కష్టాలు: రంజాన్ రోజు బిర్యానీకి గ్యాస్ సెగ.. మండుతున్న రేట్లు..

తమిళనాడులో గ్యాస్ కష్టాలు: రంజాన్ రోజు బిర్యానీకి గ్యాస్ సెగ.. మండుతున్న రేట్లు..

తమిళనాడులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల (LPG) కొరత కారణంగా హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్యాస్ సిలిండర్ దొరక్కపోవడంతో చాలా హోటళ్లు మళ్లీ పాతకాలపు పద్ధతిలో కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల బిర్యానీ వంటి వంటకాలను కట్టెలపైనే వండుతున్నారు. దీనివల్ల రుచి పెరిగినా, కట్టెల ధరలు కూడా పెరగడంతో వంటకాల ధరలు అధికం అవుతున్నాయి.

గ్యాస్ ఆదా చేయడానికి డీప్-ఫ్రై అంటే నూనెలో వేయించే వంటకాలను తగ్గించేశారు. కొన్ని హోటళ్లలో మెనూలో మార్పులు చేస్తూ  దోసెలు వంటివి రోజంతా వేయడం లేదు. కేవలం చపాతీ, పరోటా వంటివి మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. చెన్నైలో హోటల్ బిజినెస్ ఇప్పటివరకు 30% వరకు పడిపోయింది. గ్యాస్ లేకపోవడం వల్ల  వ్యాపారంపై దెబ్బ పడుతూ దాదాపు 90% హోటళ్లు అసలు లాభాలు లేకుండానే నడుస్తున్నాయని హోటళ్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే ఖర్చులు తగ్గించుకోవడానికి కొన్ని హోటళ్లు ఒకే చోట పెద్ద కిచెన్లు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో వంటలు చేసి, అక్కడి నుండి వేర్వేరు బ్రాంచ్‌లకు సప్లయ్ చేస్తున్నాయి. గ్యాస్, కట్టెలపై ఆధారపడటం తగ్గించడానికి చాలామంది కరెంట్ స్టవ్‌లు వాడేందుకు  మొగ్గు చూపుతున్నారు.

రంజాన్ పండుగ రోజున 
 ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో హోటళ్లకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ వంట గ్యాస్ కొరత వల్ల బిర్యానీ ధరలు పెరగడం, క్వాంటిటీ  తగ్గడం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితి రంజాన్ పండుగ ఆచారాలను కూడా ప్రభావం  చేసిందని స్థానికులు అంటున్నారు.

ధరల పెరుగుదల వల్ల ప్రజలు కూడా గ్రాండ్‌గా పార్టీలు చేసుకోకుండా, చిన్నగా ఇళ్లలోనే భోజనాలతో ముగిస్తున్నారు. గ్యాస్ సప్లయ్ సాధారణ స్థితికి రాకపోతే హోటళ్లలో వంటకాల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తమిళనాడు హోటల్స్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది.