క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో రారాజుగా కొనసాగిన బిట్‌కాయిన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆదివారం ఉదయం ట్రేడింగ్ సమయంలో బిట్‌కాయిన్ విలువ 6.4 శాతం మేర క్షీణించి, సుమారు 78వేల 823 డాలర్ల వద్దకు పడిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో ఆల్‌టైమ్ హై రికార్డులను సృష్టించిన బిట్‌కాయిన్, అప్పటి నుంచి ఇప్పటి వరకు తన విలువలో ఏకంగా మూడో వంతును కోల్పోవడం గమనార్హం. కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాక ఈథర్ కూడా 11.76 శాతం మేర పతనమై 2వేల 387 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ హఠాత్తు పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.
బిట్‌కాయిన్ పతనానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్‌గా మాజీ గవర్నర్ కెవిన్ వార్ష్ ఎంపిక కావడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు బిట్‌కాయిన్ లాంటి ఆస్తుల ధరలు పెరుగుతాయి. అయితే కెవిన్ వార్ష్ 'టైట్ మనీ పాలసీ'ని ఇష్టపడే వ్యక్తి. ఆయన ఫెడ్ బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించాలని.. వ్యవస్థలో అదనంగా ఉన్న డాలర్లను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం తగ్గి.. క్రిప్టో లాంటి పెట్టుబడులపై(Speculative Assets) ప్రతికూల ప్రభావం పడుతుందనే భయం ఇన్వెస్టర్లలో స్టార్ట్ అయ్యింది.
గతంలో ఫెడ్ అనుసరించిన ఉదారవాద విధానాల వల్ల బాండ్లు, క్రిప్టో, మెటల్స్, మీమ్ స్టాక్స్‌లో ఒకరకమైన బబుల్ ఏర్పడిందని అనెక్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఎకనమిస్ట్ బ్రియాన్ జాకబ్సెన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వార్ష్ రాకతో ఆ బబుల్ పేలే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో క్రిప్టోలకు స్వర్ణయుగం వస్తుందని, సానుకూల నిబంధనలు ఉంటాయని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకపక్క బంగారం, స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడుతుంటే.. మరోపక్క క్రిప్టో మార్కెట్ మాత్రం దిశానిర్దేశం లేక కొట్టుమిట్టాడుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న రేట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా కొనసాగే అవకాశం ఉందని క్రిప్టో నిపుణులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం నాటి భారీ పతనం ఇన్వెస్టర్లకు క్రిప్టోలోని రిస్కులను మరోసారి గుర్తుచేసింది. రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని అమ్మకాలు జరిగే అవకాశం ఉందని.. దీనివల్ల ధరలు ఇంకా కిందకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నాటి గరిష్ట స్థాయిల నుంచి వరుసగా పతనమవుతున్న బిట్‌కాయిన్, తిరిగి ఎప్పుడు పుంజుకుంటుందో అని సామాన్య ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. లక్ష డాలర్ల మార్కును క్రాస్ చేసి జీవితకాల రికార్డులకు చేరిన బిట్ కాయిన్ ప్రస్తుతం 80వేల డాలర్ల కిందికి పడిపోవటంపై ఇన్వెస్టర్లలో నిరాశ కొనసాగుతోంది. అయితే పెద్దపెద్ద ఇన్వెస్టర్లు మాత్రం దీనిని కొనుగోలుకు కొత్త అవకాశంగా భావిస్తూ డబ్బు కుమ్మరిస్తున్నారు క్రిప్టోల్లో.
