చతికిలబడ్డ క్రిప్టో కింగ్ బిట్‌కాయిన్.. ఇన్వెస్టర్ల సంపద రూ.9 లక్షల కోట్లు ఆవిరి..

చతికిలబడ్డ క్రిప్టో కింగ్ బిట్‌కాయిన్.. ఇన్వెస్టర్ల సంపద రూ.9 లక్షల కోట్లు ఆవిరి..

డిసెంబర్ 30న క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర 90వేల డాలర్ల మార్కును తాకినట్టే తాకి.. 24 గంటల్లోనే 3.23 శాతం మేర పతనమై 87వేల264 డాలర్ల స్థాయికి పడిపోయింది. తాజా తగ్గుదల వల్ల మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ ఏకంగా 100 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది.

అసలు బిట్‌కాయిన్ ఎందుకు పడిపోయింది? 
బిట్‌కాయిన్ 90వేల డాలర్ల వద్ద ఉన్న బలమైన 'రెసిస్టెన్స్'ను అధిగమించలేకపోయిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ స్థాయిని దాటడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో.. భారీగా ప్రాఫిట్ బుక్కింగ్ జరిగింది. ముఖ్యంగా 'లివరేజ్'తో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు తమ పొజిషన్ల నుంచి తప్పుకోవాల్సి రావడంతో మార్కెట్ మరింత కిందకు జారింది. ఏడాది చివర కావడంతో మార్కెట్‌లో లిక్విడిటీ తక్కువగా ఉండటం కూడా ఈ పతనానికి మరో కారణంగా నిలుస్తోంది.

కేవలం క్రిప్టో మార్కెట్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా రిస్క్ అసెట్స్ అన్నీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చైనా-తైవాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు క్రిప్టో వంటి రిస్క్ ఎక్కువగా ఉండే అసెట్స్ నుంచి డబ్బును వెనక్కి తీసుకుని సురక్షితమైన మార్గాల వైపు చూస్తారు. అమెరికాతో పాటు ఇతర దేశాల ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు ఉన్నప్పటికీ, ఏడాది చివర కావడంతో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు వెనకాడుతున్నారని వజీర్-ఎక్స్ వ్యవస్థాపకుడు నిశ్చల్ శెట్టి అభిప్రాయపడ్డారు.

మున్ముందు ఎలా ఉండబోతోంది? 
ప్రస్తుతానికి బిట్‌కాయిన్‌కు 87వేల డాలర్ల నుండి 87వేల300 డాలర్ల వద్ద సపోర్ట్ కలిగి ఉంది. ఒకవేళ ధర దీనికంటే దిగువకు పడిపోతే.. 86వేల డాలర్ల స్థాయిని బిట్ కాయిన్ టెస్ట్ చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఒక సానుకూల అంశం ఏమిటంటే.. జూలై నెల తర్వాత మొదటిసారిగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మళ్లీ బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడం ప్రారంభించటమే. ఇది భవిష్యత్తులో క్రిప్టో రేట్లు మళ్లీ పుంజుకుంటాయనే నమ్మకాన్ని ఇన్వెస్టర్లలో కలిగిస్తోంది.

ప్రస్తుతానికి మార్కెట్ ఒక పరిధిలో ఊగిసలాడే అవకాశం ఉన్నందున.. ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీగా లెవరేజ్ తీసుకుని ట్రేడింగ్ చేయవద్దని, మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం మంచిదని హెచ్చరిస్తున్నారు. బంగారం, వెండి వంటి లోహాల్లో ఓలటాలిటీ తగ్గినప్పుడు.. ఆ ఇన్వెస్టర్లు మళ్లీ క్రిప్టో వైపు మళ్లే అవకాశం ఉందని, ఇది మార్కెట్‌కు కొత్త ఊపిరిని పోయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.