బిట్‌కాయిన్ ఢమాల్: ఈటీఎఫ్స్ నుంచి తరలిపోతున్న ఇన్వెస్టర్ల సంపద

బిట్‌కాయిన్ ఢమాల్: ఈటీఎఫ్స్ నుంచి తరలిపోతున్న ఇన్వెస్టర్ల సంపద

ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకర్షించే బిట్‌కాయిన్ ట్రేడింగ్ ప్రస్తుతం తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని 'బిథంబ్' ఎక్స్ఛేంజ్ కార్యాలయం నుండి సింగపూర్ ట్రేడింగ్ డెస్క్‌ల వరకు.. ఎక్కడ చూసినా బిట్‌కాయిన్ మార్కెట్ గురించిన ఆందోళనలే కనిపిస్తున్నాయి. 

గతేడాది అక్టోబర్‌లో సరికొత్త గరిష్టాలను తాకిన ఈ డిజిటల్ కరెన్సీ.. కేవలం కొన్ని నెలల్లోనే తన పీక్ వాల్యూ నుంచి దాదాపు 50 శాతానికి పైగా పతనమై ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. ఆసియా మార్కెట్లలో సాగిన తాజా ట్రేడింగ్ సెషన్ బిట్‌కాయిన్ అసలు సిసలైన ఓలటాలిటీని ఇన్వెస్టర్ల కళ్లకు కట్టింది. 5 వారాల కనిష్ట స్థాయికి పడిపోతూ బిట్‌కాయిన్ ధర సింగపూర్ మార్కెట్లో 74వేల 017 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా.. మార్కెట్లో రెండో అతిపెద్ద టోకెన్ అయిన ఈథర్ కూడా 2 శాతానికి పైగా క్షీణించి క్రిప్టో మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది.

ప్రస్తుత బిట్‌కాయిన్ పతనానికి క్రిప్టో ప్రపంచంలోని అంతర్గత లోపాలు కారణం కాదు. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక, రాజకీయ సమీకరణాలే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. ఇది కాస్తా వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందనే భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. మరోవైపు ఏఐ జోరుతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలకు దూసుకెళ్తుంటే.. బిట్‌కాయిన్ మాత్రం చతికిలపడటం గమనార్హం. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలోపేతం కావడం వంటి కారణాలే క్రిప్టో మార్కెట్‌ను దెబ్బతీశాయని ఫాల్కన్ఎక్స్ ప్రతినిధి సీన్ మెక్‌నల్టీ అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో అమెరికా స్పాట్-బిట్‌కాయిన్ ETFs నుండి మే నెలలోనే సుమారు 1.5 బిలియన్ డాలర్ల నిధులు తరలి పోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద బిట్‌కాయిన్ ఈటీఎఫ్ అయిన ఐషేర్స్ బిట్‌కాయిన్ ట్రస్ట్ లో భారీగా బ్లాక్ సేల్ జరగడం ఇన్వెస్టర్లలో గుబులు పుట్టించింది. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన జరిగే వరకు క్రిప్టో ట్రేడర్లు ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉందని ఐజీ మార్కెట్స్ అనలిస్ట్ టోనీ సికామూర్ అన్నారు. 70వేల డాలర్ల మధ్యలో ఉన్న కీలక సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వడంతో.. లాంగ్ పొజిషన్స్ ఉన్న ట్రేడర్లు తమ నష్టాలను తగ్గించుకునేందుకు దూకుడుగా అమ్మకాలకు దిగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో క్రిప్టో మార్కెట్ మరింత కిందకు పడిపోయే ప్రమాదం ఉందని.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.