
రుచికి చేదు అయినా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాకర. దీనిలోని పీచు జీర్ణసంబంధిత సమస్యల్ని దరిచేరనివ్వడు. విటమిన్- ఎ, సి, పొటాషియం, జింక్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి కాకరలో.. వీటిని తరచూ తింటే రక్తహీనత నుంచి కూడా బయటపడొచ్చు. మరిన్ని లాభాలున్న కాకరని కాస్త వెరైటీగా వండుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరింకెందుకు ఆలస్యం.... కమ్మని కాకరకాయ వంటల్ని ట్రై చేయండి..
కాకర పెరుగు పచ్చడి తయారీకి కావాల్సినవి
- కాకరకాయ - ఒకటి
- చిక్కటి పెరుగు- ఒక కప్పు
- పచ్చిమిర్చి- రెండు
- కొబ్బరి తురుము- అర కప్పు
- ఆవాలు - ఒక టీ స్పూన్
- ఎండుమిర్చి- ఒకటి
- నూనె- వేగించడానికి సరిపడా
- ఉప్పు- తగినంత
- కరివేపాకు- రెండు రెబ్బలు
తయారీ విధానం : కాకరకాయను నాలుగు ముక్కల్లా చేసుకుని ఉప్పు నీళ్లలో వేయాలి.. కాసేపయ్యాక వీరంతా గట్టిగా పిండేసి ముక్కల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, సగం ఆవాలను వేసి మిక్సీ పట్టాలి. పెరుగులో ఈ మిశ్రమం.. వేగించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి మిగిలిక ఆవాలు, ఎందుమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసి వేగించిన పెరుగుపై వేసి కలపాలి.
నిమ్మ, కాకరకాయ తో వెరైటీ వంటకం తయారీకి కావాల్సినవి
- కాకరకాయలు- నాలుగు
- నిమ్మకాయలు- ఆరు
- పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్ స్పూన్
- నిమ్మరసం- ఒక కప్పు
- కారం-రెండు టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి- పది రెబ్బలు
- ఉప్పు - తగినంత
- నూనె - సరిపడా
- వేగించిన మెంతుల పొడి-అర టేబుల్ స్పూన్
తయారీ విధానం: ముందుగా కాకరకాయను చక్రాలుగా, నిమ్మకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో, నిమ్మ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో కారం, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరోసారి. కలపాలి. ఇప్పుడు పాన్ లో నూనెవేడి చేసి కాకరకాయ మిశ్రమంలో పోసి బాగా కలపాలి. మూడు రోజుల పాటు ఆ మిశ్రమాన్ని తాకకుండా పక్కనుంచాలి. తర్వాత మెంతి పొడి వేసి ఇంకోసారి కలిపి మరో మూడు రోజుల తరవాత రుచి చూడాలి.
కాకరకాయ తో ఊరగాయ ఎలా...
- కాకరకాయ ముక్కలు.. (సన్నగా తరిగిన) - ఒక కప్పు
- ఉప్పు- ఒక టేబుల్ స్పూన్
- కారం- ఒక టేబుల్ స్పూన్
- మెంతి పొడి- అరటీస్పూన్
- ఆవపిండి- అర టీ స్పూన్
- పసుపు- చిటికెడు
- చక్కెర- చిటికెడు
- నిమ్మరసం - ఒక టీ స్పూన్
- నూనె- ఒక కప్పు
- ఇంగువ - పావు టీ స్పూన్
తయారీ విధానం: పాన్ లో అరకప్పు నూనె వేడిచేసి కాకరకాయ ముక్కల్ని దోరగా వేగించుకోవాలి. మరోగిన్నెలో మెంతి, ఆవపిండి, పసుపు, చక్కెర, ఇంగువ, ఉప్పు, కారం ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి. ఆ తరువాత వేగించి పెట్టుకున్న కాకర ముక్కల్ని కూడా కలిపి పైన నిమ్మరసం పిండాలి. మిగిలిన నూనెలో ఇంగువ వేసి వేడిచేసి పచ్చడిపై వేస్తే సరిపోతుంది.
కాకర తో టిక్కీ ఎలా తయారు చేయాలి
- కాకరకాయలు- రెండు
- క్యారెట్ తరుము -ఒక టేబుల్ స్పూన్
- వచ్చి బఠాణీలు- పావు కప్పు
- బియ్యప్పిండి- ఒక కప్పు
- బొంబాయి రవ్వ - పావు కప్పు
- కొత్తిమీర- పావు కప్పు
- ఉల్లిగడ్డ తరుగు - ఒక టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి- రెండు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
- ధనియాల పొడి - ఒక టీ స్పూన్
- నూనె-వేగించడానికి సరిపడా
- ఉప్పు- తగినంత
తయారీ విధానం: కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేయాలి. ఉల్లిగడ్డ తరుగు, గింజలు తీసేసిన కాకరకాయల్ని వేర్వేరుగా మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఒక గిన్నెలో ఉల్లిగడ్డ, కాకర పేస్ట్ బఠాణి పేస్ట్ మిశ్రమం, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి. తర్వాత బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని టిక్కీల్లాగా ఒత్తుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేడిచేసి ఆ టిక్కీలని రెండు వైపులా కాల్చాలి.
కాకర పకోడి తయారీ
- కాకరకాయలు -పావు కేజీ
- బియ్యప్పిండి- ఆరు టేబుల్ స్పూన్లు
- ఉప్పు- రుచికి సరిపడా.
- మిరియాల పొడి- పావు టీ స్పూన్
- కారం- ఒక టీ స్పూన్
- పసుపు- పావు టీ స్పూన్
- ఇంగువ- చిటికెడు
- గరం మసాలా- పావు టీ స్పూన్
- నూనె- వేగించడానికి సరిపడ
తయారీ విధానం : కాకరకాయలను నిలువుగా కోసి గింజలు తీసి ముక్కలు చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉండాలి. ఆ మిశ్రమంలో బియ్యప్పిండి, ఉప్పు, గరం మసాల, ఇంగువ, కారం కూడా కలపాలి. పది నిమిషాల తర్వాత కాగే నూనెలో పకోడీల్లా వేసి దోరగా వేగించాలి. అంతే టేస్టే కాకరకాయ పకోడి రెడి..