బడ్జెట్​ సమావేశాల్లో వ్యూహాలపై బీజేఎల్పీ సమావేశం

బడ్జెట్​ సమావేశాల్లో వ్యూహాలపై బీజేఎల్పీ సమావేశం
  • డబుల్​ బెడ్రూం ఇండ్లు, 
  • 317 జీవో, పింఛన్లపై ప్రశ్నించాలని నిర్ణయం
  • రైతులు, ఆర్థిక వ్యవహారాలపై మాట్లాడే బాధ్యతలు ఈటలకు
  • నిరుద్యోగుల సమస్యలపై రఘునందన్​రావుకు, హైదరాబాద్​ సమస్యలపై రాజాసింగ్​కు బాధ్యతలు 

హైదరాబాద్​, వెలుగు: ప్రజా సమస్యలపై ప్రశ్నించడంతో పాటు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలపై అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. డబుల్​ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, 317 జీవో, పోడు భూములు, యాసంగిలో ధాన్యం కొనుగోలు, పంట నష్టపరిహారం, కొత్త రేషన్​ కార్డులు, ఆసరా పింఛన్లు, విద్య, వైద్య వ్యవస్థలోని లోపాలపై అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తేందుకు పార్టీ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. రైతుల సమస్యలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల వంటి వాటిపై ఈటల రాజేందర్​, నిరుద్యోగం, ఉద్యోగుల సమస్యలపై రఘునందన్​ రావు, హైదరాబాద్​ నగర సమస్యలపై రాజాసింగ్​ మాట్లాడేలా నిర్ణయించారు. శుక్రవారం పార్టీ స్టేట్​ ఆఫీసులో నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​ చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్​, ఈటల రాజేందర్​, మండలి మాజీ చైర్మన్​ స్వామి గౌడ్​, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​ రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్​ రెడ్డి పాల్గొన్నారు. మల్లన్నసాగర్​ ప్రాజెక్టు నీళ్లు అందించే విషయంపై దుబ్బాక నియోజకవర్గంలో సమావేశం ఉండడంతో రఘునందన్​రావు హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

టీఆర్​ఎస్​ ట్రాప్​ లో పడొద్దు: సంజయ్​
ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్​ఎస్​లో అసహనం పెరిగిపోయిందని, బీజేపీని ఇరకాటంలో పడేసేందుకు టీఆర్​ఎస్​ శతవిధాలా ప్రయత్నించే అవకాశం ఉందని పార్టీ నేతలకు సంజయ్​ వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్​ఎస్​ ట్రాప్​లో పడకుండా ప్రజల సమస్యలు, ఏడేండ్లలో టీఆర్​ఎస్​ సర్కార్​ వైఫల్యాలను సభలో ఎండగట్టాలని సూచించారు. తద్వారా ప్రజల సమస్యలపై బీజేపీ పోరాడుతోందన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రశ్నోత్తరాలు, చర్చ, జీరో అవర్​ వంటి వాటిని పక్కాగా ఉపయోగించుకోవాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు మంద బలం ఎక్కువున్న టీఆర్​ఎస్​ అడ్డుపడే అవకాశం ఉందన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ పదేపదే టీఆర్​ఎస్​ ఆరోపిస్తోందని, ఇప్పటిదాకా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను సభలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని ఈటల చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండడంతో బీజేపీని బద్నాం చేసేందుకు పీకేతో కలిసి సీఎం కేసీఆర్​ పని చేస్తున్నారని రాజాసింగ్​ అన్నారు. కాగా,  నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన పలువురు శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ స్టేట్ ఆఫీసులో వారికి.. సంజయ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంట్లో లొల్లి అయినప్పుడల్లా కేసీఆర్ దేశ రాజకీయాలంటూ ఢిల్లీ వెళ్తారని సంజయ్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ‘‘నన్ను కలవండి ప్లీజ్’’ అంటూ నేతలను కేసీఆర్ వేడుకుంటున్నారని విమర్శించారు.

ఫ్లోర్​ లీడర్​గా రాజాసింగ్​ 
పార్టీ శాసన సభాపక్ష నేతగా ఈటల​ను నియమించాలంటూ పార్టీ నేతలు సూచించినా.. ఈసారికి రాజాసింగ్​నే కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది. రాబోయే రోజుల్లో ఆ బాధ్యతలను ఈటలకు అప్పగించే విషయంపై హైకమాండ్​ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయవద్దంటూ హైకమాండ్​ నుంచీ ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.  

మరిన్ని వార్తల కోసం..

భూముల రిజిస్ట్రేషన్లపై అదనపు బాదుడు!

టిమ్స్​లో ముగియనున్న డాక్టర్లు, నర్సుల కాంట్రాక్ట్​