టిమ్స్​లో ముగియనున్న డాక్టర్లు, నర్సుల కాంట్రాక్ట్​

టిమ్స్​లో ముగియనున్న డాక్టర్లు, నర్సుల కాంట్రాక్ట్​
  • రెన్యూవల్​పై క్లారిటీ ఇవ్వని ఉన్నతాధికారులు
  • ఆందోళనలో 70 మంది డాక్టర్లు, 250 మంది నర్సులు, ఇతర సిబ్బంది

గచ్చిబౌలి, వెలుగు: టిమ్స్ హాస్పిటల్​లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, సిబ్బంది కాంట్రాక్ట్ ఈ నెల 31తో ముగియ
నుంది. రెన్యూవల్ ​చేసే విషయంలో ఉన్నతాధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కరోనా కేసులు తగ్గిపోవడంతో కాంట్రాక్ట్​ పొడిగించే అవకాశం లేదని ఇంటర్నల్​గా చెప్పినట్లు సిబ్బంది ద్వారా తెలిసింది. ఇప్పటికే సెక్యూరిటీ, పేషెంట్ ​కేర్, ఇతర సిబ్బందిని మార్చి31 తర్వాత డ్యూటీలకు రావొద్దని చెప్పినట్లు సమాచారం. కానీ ఉన్నతాధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న టైంలో తమతో పని చేయించుకున్న ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్ట్​పూర్తయిందని, కొవిడ్ కేసులు తగ్గిపోయాయి కాబట్టి పొడిగించే చాన్స్ ​లేదని హాస్పిటల్​లోని ఆఫీసర్ల ద్వారా చెప్పించడం ఎంత వరకు కరెక్ట్​అని ప్రశ్నిస్తున్నారు. 

కరోనా తీవ్రత ఉన్నప్పుడు..
కరోనా ఫస్ట్​ వేవ్​ టైంలో రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంలోని ఓ బిల్డింగ్​లో టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ సైన్సెస్​)ను​ఏర్పాటు చేసింది. అందులో కరోనా పేషెంట్లకు ట్రీట్​మెంట్ అందిస్తామని తెలిపింది. పేషెంట్లకు సేవలు అందించేందుకు కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​పద్ధతిలో డాక్టర్లు, నర్సులు, సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ కేర్, హౌస్​ కీపింగ్ సిబ్బందిని నియమించింది. అప్పటి నుంచి టిమ్స్​లో కొవిడ్​పేషెంట్లకు ట్రీట్​మెంట్అందుతోంది. గతేడాది మార్చిలో అందరి కాంట్రాక్ట్ ​ముగియడంతో ప్రభుత్వం రెన్యూవల్ ​చేసింది. ఈ ఏడాది కూడా పొడిగిస్తారనుకున్న డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోవడంతో రెన్యూవల్​ చేసే అవకాశం లేదని ఇంటర్నల్​గా చెబుతున్నారు.

ప్రస్తుతం టిమ్స్​లో 70 మంది డాక్టర్లు, 250 మంది నర్సులు, 125 మంది వరకు సెక్యూరిటీ గార్డులు, హౌస్​ కీపింగ్, పేషెంట్​ కేర్ సిబ్బంది, ల్యాబ్​ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ నెల31తో అందరి కాంట్రాక్ట్​ ముగుస్తుంది. కానీ రెన్యూవల్​కు సంబంధించి ఆఫీసర్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీనిపై టిమ్స్ ఉన్నతాధికారులను అడగగా ‘ప్రస్తుతం కరోనా లేదు. మొదట్లో కరోనా కోసం నియమించుకున్న డాక్టర్లు, నర్సుల కాంట్రాక్ట్​ను పొడిగించే అవకాశం లేదని’ చెప్పారని డాక్టర్లు, నర్సులు తెలిపారు. దీంతో మార్చి 31 తర్వాత తమ ఉద్యోగం ఉంటుందా.. పోతుందా అనే ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే సెక్యూరిటీ, పేషెంట్​కేర్ సర్వీస్, ల్యాబ్ టెక్నీషియన్, హౌస్ కీపింగ్ వాళ్లను ఏప్రిల్1 నుంచి డ్యూటీకి రావద్దని చెప్పినట్లు సిబ్బంది అంటున్నారు. సిబ్బంది రెన్యూవల్​పై టిమ్స్ ​డైరెక్టర్ ​విమలా థామస్​ను వివరణ కోరగా రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు.

త్వరలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​​
రెండేళ్లుగా కొవిడ్​సేవలు అందిస్తున్న టిమ్స్​ను త్వరలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​గా మార్చనున్నట్లు తెలిసింది. అందుకోసం ఇప్పటికే ఆర్అండ్ బీ ఆఫీసర్లు టిమ్స్ బిల్డింగ్​ను సందర్శించారు. ఏప్రిల్ మొదటి వారంలో స్టార్ట్​చేస్తారని సమాచారం. ఆపరేషన్ థియేటర్లు, ర్యాంపులు, వార్డుల ఏర్పాటుకు ప్లాన్​చేసినట్లు సమాచారం.  మల్టీ స్పెషాలిటీగా మారిస్తే టిమ్స్​లో పూర్తిస్థాయి ఓపీ సేవలు అందుబాటులోకి వస్తాయి.