భూముల రిజిస్ట్రేషన్లపై అదనపు బాదుడు!

భూముల రిజిస్ట్రేషన్లపై అదనపు బాదుడు!

వనపర్తి, వెలుగు: ఖజానా నింపుకొనేందుకు నెల క్రితం భూముల విలువను పెంచిన సర్కారు ఇప్పుడు మ్యుటేషన్, యూజర్​చార్జీలు, హరిత నిధి పేరిట అడిషనల్​బాదుడు బాదుతోంది. ఇప్పటికే భూముల విలువ పెంపుతో గతంతో పోలిస్తే రిజిస్ట్రేషన్లకు 50 శాతం వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఒక్కొక్కరిపై రూ. 1,400 పైగా భారం మోపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని స్థలాల విలువలను 45 శాతం, గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల విలువను 35 శాతం పెంచింది. గతంలో 6 శాతం ఉన్న స్టాంప్ డ్యూటీని 7.5 శాతం చేసింది. పెరిగిన వాల్యుయేషన్ కు తగ్గట్టుగా చలాన్ కట్టలేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా మార్చి 1 నుంచి అడిషనల్​బాదుడు మొదలైంది. రూ. 105 ఉన్న యూజర్ చార్జీలను రూ. 500 చేశారు. అలాగే మ్యుటేషన్ చార్జీలు గతంలో పట్టణాల వరకే ఉండగా ఇప్పుడు రూరల్​ప్రాంతాల్లోనూ వసూలు చేస్తున్నారు. ప్రతి డాక్యుమెంట్ పై వెయ్యి రూపాయలు, హరితనిధి కింద మరో రూ. 50 వసూలు చేయాలంటూ తాజాగా ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ లకు ఆదేశాలు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో 100 గజాల స్థలం కొనాలంటే రూ. 50 వేల నుంచి 75 వేల వరకు ప్రభుత్వానికే చలాన్ రూపంలో కట్టాల్సి వస్తుండడంతో సామాన్య జనం ఇండ్ల స్థలాలు, భూములు కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలకు రెక్కలు రావడంతో ఇతర ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా సిండికేట్ గా మారి వెంచర్లు వేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంచర్ల నిర్వాహకుల నుంచి భారీగా పన్ను రాబడుతుండడంతో అది కూడా ప్లాట్లు కొనేవారికి భారంగా మారింది.  

పాత వెంచర్ల ప్లాట్లపై సందిగ్ధం
పట్టణాలు, మున్సిపాలిటీల పరిధిలో గతంలో అనుమతి లేకుండా చేసిన వెంచర్లలో మిగిలిపోయిన ప్లాట్లను రిజిస్ట్రేషన్​చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ల్యాండ్ ఓనర్ల పేరున ఉన్న ప్లాట్లు వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసిన పేదలకు రిజిస్ట్రేషన్ కావడం లేదు. డబ్బు పూర్తిగా చెల్లించి కొన్నవారికి మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యాయి. దీన్ని సవాల్ చేస్తూ చాలామంది ల్యాండ్ ఓనర్లు హైకోర్టును ఆశ్రయించారు. మిగిలిపోయిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటూ కోర్టు సబ్ రిజిస్ట్రార్ లకు సూచించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు సైతం కొందరు సబ్ రిజిస్ట్రార్ లు అమలు చేయడం లేదు. ఏవో సాకులు చూపించి జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. 

పార్టిషన్​ రిజిస్ట్రేషన్ అవుతలే..
ఉన్న భూమిలో కొంత మాత్రమే అమ్మాలనుకునే ల్యాండ్ ఓనర్ల హక్కును ప్రభుత్వం కాలరాస్తూ పార్టిషన్​ రిజిస్ట్రేషన్ నిలిపివేసింది. నాలా కన్వర్షన్ భూములకు ఈ రూల్​అమలవుతోంది. ఒక వ్యక్తికి 3 ఎకరాల భూమి ఉంటే అందులో అవసరాల కోసం 2 ఎకరాలను అమ్మి మిగతా ఎకరం భవిష్యత్ అవసరాల కోసం ఉంచుకుందామంటే కుదరడం లేదు. ఇందుకు సంబంధించి లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పార్ట్​  రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. అమ్మితే మొత్తం భూమి అమ్మేయాలంటూ సబ్ రిజిస్ట్రార్ లు తేల్చి చెబుతున్నారు. ఓనర్ కు ఉన్న ఆస్తి లో సగభాగం అమ్మడం కుదరదని, గుండుగుత్తగా మొత్తం కొనాల్సిందేనంటూ చెబుతుండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై చాలా మంది కోర్టును ఆశ్రయిస్తున్నారు. 

పార్టిషన్​ రిజిస్ట్రేషన్ చేయలేం
రాష్ట్ర ప్రభుత్వం పార్టిషన్​ రిజిస్ట్రేషన్ విషయంలో నిషేధం విధిస్తూ మౌఖికంగా ఆదేశాలు ఇచ్చింది. ఓనర్లు మొత్తం భూమి అమ్ముకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అందులో కొంత మిగుల్చుకునేందుకు అవకాశం లేదు. ఇందులో సబ్ రిజిస్ట్రార్ల పాత్ర ఏమాత్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, యూజర్, మ్యుటేషన్ చార్జీలు, హరితనిధి వసూలు చేస్తున్నాం.
– క్రిస్టోఫర్, సబ్ రిజిస్ట్రార్, వనపర్తి

మొత్తం అమ్మాలంటే ఎలా?
ఎకరా భూమిలో 30 కుంటలు అమ్మేసి 10 గుంటల్లో ఇల్లు కట్టుకుందామని అనుకున్నాం. ఇతరులకు 30 కుంటలు అమ్మి అగ్రిమెంట్ చేసి డబ్బు తీసుకున్నాం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరదని చెబుతున్నారు. అమ్మితే మొత్తం భూమి అమ్మాలని సలహా ఇస్తున్నారు. ఇలాంటి రూల్​ఎక్కడా ఉండదు. దీనిని త్వరగా మారిస్తేనే అందరికీ మేలు జరుగుతుంది.      

- శ్రీనివాసమూర్తి, వనపర్తి