- పీపీపీ మోడ్‌లో 14 అభివృద్ధి ప్రాజెక్టులు
- ప్రైవేట్ భాగస్వామ్యంతో మరో 17...
- అనంతగిరి, బుద్ధవనం, సోమశిలపై ఇన్వెస్టర్ల ఆసక్తి
- లగ్జరీ రిసార్ట్స్, థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ టూరిజం పాలసీ.. భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. ఐదేండ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని సంకల్పించింది. అయితే, పాలసీ తీసుకొచ్చిన ఏడాది వ్యవధిలోనే మొత్తం రూ.13,819 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు డెవలపర్లు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు.
ఆయా ప్రాజెక్టుల ద్వారా సుమారు 17,960 మందికి ఈ రంగంలో ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత టూరిజానికి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. హైదరాబాద్ తో పాటు వికారాబాద్, సాగర్, బుద్ధవనం, అమరగిరి, సోమశిల, అమ్రాబాద్తదితర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో దేశీయ, అంతర్జాతీయ డెవలపర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు.
పెట్టుబడులతో అంతర్జాతీయ గమ్యస్థానంగా మారనున్న తెలంగాణ
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కీలక పాత్ర పోషిస్తున్నది. పీపీపీ, ప్రైవేట్ సెక్టార్ నుంచి వచ్చే పెట్టుబడులతో తెలంగాణను అంతర్జాతీయ గమ్యస్థానంగా మార్చనున్నది. ప్రస్తుతం ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో 14 ప్రాజెక్టులకు రూ.7,081 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
దీనిద్వారా 8,920 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రైవేట్ భాగస్వామ్యంతో 17 ప్రాజెక్టులు చేపట్టేందుకు పలువురు డెవలపర్లు ముందుకు రాగా.. రూ.6,738 కోట్లు పెట్టేందుకు ఆసక్తిచూపుతున్నారు. దీనిద్వారా 9,040 ఉద్యోగాలు కల్పించనున్నారు.
లగ్జరీ హోటల్స్, కన్వెన్షన్స్, థీమ్ పార్కులు
వికారాబాద్‌లో ఎకో, అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. అనంతగిరిలో ట్రెక్కింగ్, సఫారీ, ఫారెస్ట్ రిసార్టులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. అనంతగిరి హిల్స్‌లో జెసామ్, జెన్ మేఘాలతో జాయింట్ వెంచర్ వెల్నెస్ సెంటర్, వైన్ మేకింగ్ యూనిట్, గింజర్ హోటల్స్ నిర్మించనున్నారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ అనంతగిరిలో 81 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,021 కోట్లతో లగ్జరీ ‘లా వీ వెల్‌నెస్ రిట్రీట్’ను నిర్మిస్తున్నది.
బుద్ధవనంలో వెడ్డింగ్, వెల్నెస్ సెంటర్లు అభివృద్ధి చేస్తున్నారు. మహాబోధి సొసైటీ.. బుద్ధిస్ట్ మిషనరీ మెడిటేషన్ సెంటర్ఏర్పాటు చేయనున్నది. థైవాన్ ఫోగువాంగ్ షాన్ సంస్థ కూడా పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. బుద్ధవనంలో వెడ్డింగ్ డెస్టినేషన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. హౌస్ బోట్స్, వెల్నెస్ రిట్రీట్లు, కన్వెన్షన్ సెంటర్లు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
కృష్ణా నది బ్యాక్ వాటర్‌లో సోమశిలను డెస్టినేషన్ వెడ్డింగ్స్, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చుట్టూ ఎకో -టూరిజం ప్రాజెక్టులు చేపడుతున్నారు. హెరిటేజ్ సైట్లు, ట్రైబల్ కల్చర్ ప్రమోషన్‌తో పాటు లగ్జరీ రిసార్టులు నిర్మించనున్నారు. రామోజీగ్రూప్ రామోజీ ఫిల్మ్ సిటీలో 600 ఎకరాల్లో కొత్త టూరిజం ఆకర్షణల కోసం రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నది.
హైదరాబాద్‌లోని తారామతి బారదారి 5-స్టార్ హోటల్ గ్రూప్స్ 7 ఎకరాల్లో మాట్నిక్ ఫిన్‌వెస్ట్ ఎల్‌ఎల్‌పీ నిర్మించనున్నది. సినిమా పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ మాస్టా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీఎస్యూఆర్లో 120 ఎకరాల్లో రూ.550 కోట్లతో 'బాహుబలి థీమ్ పార్క్'ను నిర్మించనున్నది. రిధిరా లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోటిపల్లి దగ్గర రూ. 487 కోట్లతో తాజ్ సఫారీతో ఎకో రిసార్ట్‌ను, యాచారంలో నోవోటెల్ వెల్‌నెస్ రిసార్ట్ ఏర్పాటు చేయనున్నది.
శంషాబాద్లో లో సిటాడెల్ హోటల్స్ రూ. 500 కోట్లతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తుండగా.. టర్మినస్ గ్రూప్ అనంతగిరిలో రూ.700 కోట్లతో జేడబ్ల్యూ మారియట్ రిసార్ట్‌ను నిర్మిస్తున్నది. మొయినాబాద్‌లోని చిలుకూరు ఎక్స్‌పీరియం గ్రూప్ రూ.750 కోట్లతో 5 -స్టార్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించనున్నది. ఇలా అనేక సంస్ఠలు టూరిజం రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి.
విదేశీ బ్రాండ్‌లతో లగ్జరీ టచ్
ప్రెస్టీజ్ గ్రూప్ హైదరాబాద్ నగరంలో 3 కీలక లగ్జరీ ప్రాజెక్టులను చేపట్టనున్నది. ఇందులో రాయదుర్గంలో ఒబెరాయ్‌తో 5 -స్టార్ హోటల్, ట్రేడ్ సెంటర్ (రూ.600 కోట్లు), బుద్వెల్‌లో సెయింట్ రెజిస్ హోటల్ (రూ.600 కోట్లు), అలాఫ్ట్ హోటల్ (రూ.300 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నది. పుప్పలగూడలో శ్రీ వెంకటేశ్వర హోటల్స్, హిల్టన్‌తో కలిసి 5-స్టార్ హోటల్, రూ.470 కోట్లతో మైస్ కేంద్రాన్ని నిర్మించనున్నది.
శంషాబాద్లో శేషసాయి హోటల్స్ ద్వారా గ్రాండ్ హయత్ (రూ.600 కోట్లు), నియోపోలీస్‌లో బ్రిగేడ్ గ్రూప్ ద్వారా ఇంటర్‌కాంటినెంటల్ (రూ.640 కోట్లు) హోటల్స్ కూడా రాబోతున్నాయి. ఈ పెట్టుబడులతో చేపట్టే అభివృద్ధి పనులతో తెలంగాణ రూపురేఖలు మారనున్నాయి.
