జోల పాటలు కాదు పోరు పాటలు..అందెశ్రీ ప్రస్థానం ఇదే

జోల పాటలు కాదు  పోరు పాటలు..అందెశ్రీ ప్రస్థానం ఇదే

ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ  గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు . అందెశ్రీ మృతిపట్ల పలువురు ప్రముఖులు,రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. 

 తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ”ను రచించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. అశు కవిత్వంలో దిట్ట. “పల్లెనీకు వందానాలమ్మో”, “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు” పాటలు ప్రసిద్ధం.  తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీకి ఇటీవల రూ.కోటి పురస్కారం అందించింది  ప్రభుత్వం.

అందెశ్రీ ప్రస్థానం

 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన గొడ్ల కాపరిగా పనిచేసారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు.  2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు

 

జోల పాటలు కాదు.. పోరు పాటలు

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామం అందెశ్రీది. ఆయనకు కులం లేదు మతం లేదు. ఆయన నలుగురు పిల్లల సర్టిఫికెట్స్ లో కులం ఉండదు. చిన్ననాటి నుంచి వెంట వచ్చిన కష్టాలను మరిచిపోవడానికి రామాయణం, యక్షగానాలు కోలాటల్లో మునిగిపోయేవాడు. తెల్లవార్లు మోట కొట్టడం, అక్కడ పని పాటలు అల్లుకోవడం అశువుగా పాడటం అబ్బింది. ఏకసంతాగ్రహి కావడం వల్ల ఆయనకు అలవోకగా బాణీలు చరణాలు తోబుట్టువులయ్యాయి. పాట ప్రవాహమైంది. తన గుండె గాయం సలుపులు తీస్తున్న కొద్దీ కంఠ గేయం చిక్కగైంది. కూలీ పని, మేస్త్రి పనీ ఇలా కనపడ్డ ప్రతి పని చేసిండు. బువ్వలేని బతుకు దుఃఖపూరితమైన జీవితం. 64 ఏళ్ల అందెశ్రీ జీవితం వడ్డించిన విస్తరి కాదు, వలపోతల కాగితం. తిరగబడనోడు గొప్ప కవి కాదు కదా, కనీసం కవి కూడా కాలేడు. లొంగిపోయేది, వంగిపోయేది జీవితం కాదు అంటాడు అందెశ్రీ. ‘‘జై బోలో తెలంగాణా.. జనగర్జనలా జడివాన’’ అని అందెశ్రీ పాడితే ఉస్మానియా యూనివర్సిటీ తొట్టెలలో వేసిన శిశువులా ఊగిపోయింది. కాంక్రీట్ జంగల్ లో మాయమైపోతున్న మానవుడిని వెతుకుతున్న సంచారి. ఆయనవి జోల పాటలు, జోకుడు పాటలు కాదు. రాజ్యం జోకొట్టి పడుకోబెట్టేవారి జబ్బజరిచి నిద్రలేపి, ఆత్మగౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరుపాటలు. అవి మండే నిప్పు కణికలు. 

 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం వరించింది. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్. 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు అందెశ్రీ, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్నారు అందెశ్రీ.