హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచి తీరుతారని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడ, సుభాష్ నగర్, అంబేద్కర్ బస్తీల్లో ఆయన ప్రచారం చేశారు. ప్రజలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు.
పదేండ్లు పాలించిన గత బీఆర్ఎస్ నాయకులు బస్తీలను విస్మరించారని, ప్రజలకు ఇండ్లు లేకుండా చేసి ఫాంహౌస్ లు కట్టుకున్నారని మండిపడ్డారు. తాము ప్రజల మధ్య ఉన్నామని, ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ రూపురేఖలు మార్చే సమయం ఇదని, యువ నేత నవీన్ ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి దిశలో సాగుతుందన్నారు.
ప్రజల అవసరాలు, పేదల బాధలు తెలుసుకున్న నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుందని, ఈ సమయంలో జూబ్లీహిల్స్‌ను రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. స్థానికంగా ఒక ఆధునిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
