జయజయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.. ఇది తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోట, ప్రతి ఇంట్లో, ప్రతి ఉద్యమకారుడి నోట పలికిన గీతం. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ రాసిన ఈ గీతాన్ని ఉద్యమ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర గీతంగా యావత్తు తెలంగాణ ప్రజలు ప్రకటించుకున్నారు. ఇటీవలే రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంత గొప్ప గీతాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన అందెశ్రీ 2025 నవంబర్ 10 వ తేదీన ఉదయం కన్నుమూయటం జీర్ణించుకోలేని విషయం. ఆయన మృతి యావత్ తెలంగాణను విషాదంలో ముంచేసింది.
వరంగల్ జిల్లా మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో (ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉంది) జన్మించిన అందెశ్రీ.. ప్రజాకవిగా, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. ప్రకృతి సంబంధించిన వర్ణనలు ఆయన పాటల్లో జీవం పోసుకున్నాయి. మనిషి జీవితం, ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని ఎన్నో పాటల్లో వర్ణించారు. అదే విధంగా మనషి తత్వాన్ని.. మానవ విలువల్లో వస్తున్న మార్పులను తన పాటల్లో వివరించారు. అందులో భాగంగానే మాయమై పోతున్నడమ్మో.. మనిషన్నవాడు.. అనే పాట ప్రతి ఇంటిని చేరుకుంది. ఆ పాట పాడని తెలుగు వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు.
బడికి వెళ్లి అక్షరాలు దిద్దకపోయినా.. ప్రకృతి ఒడిలో ఓనమాలు నేర్చారు అందెశ్రీ. అందుకే ప్రకృతినే తల్లిగా భావించి ఎన్నో పాటలు రాశారు. కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా.. అంటూ ప్రకృతి గొప్పదనాన్ని ప్రజలకు వివరించారు. అదే విధంగా పల్లెపై ఉన్న మమకారాన్ని .. పల్లెనీకు వందనములమ్మో.. అనే పాట ద్వారా చాటి చెప్పారు.
ఆయన రాసిన గలగల గజ్జెలబండి, యెల్లిపోతున్నావా తల్లి, చూడ చక్కని.. లాంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అదే విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాలో.. జన జాతరలో మన గీతం రాశారు. ఉద్యమ సమయంలో ఈ పాట కూడా ఎంతగా మార్మోగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఆధ్వర్యంలో వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందెశ్రీ పాటలు ఎన్నో ఉన్నాయి. ఆశు కవిత్వం లో చెప్పడంలో దిట్ట అయిన అందెశ్రీ.. పెన్ను పెట్టకుండానే నోటి ద్వారానే పాటను కట్టడం ఆయన గొప్పదనం.
జయ జయహే తెలంగాణ గీతం:
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం!!
పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణా!!
పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ!!
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్!!
జై తెలంగాణ జై జై తెలంగాణా!!
జానపద జనజీవన జావలీలు జాలువారు
కవిగాయక వైతాళిక కళల మంజీరాలు!!
జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర
అనునిత్యం నీగానం అమ్మ నీవే మా ప్రాణం!!
జై తెలంగాణ జై జై తెలంగాణా!!
సిరివెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం!!
సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద
సిరులు పండే సారమున్న
మాగాణియే కద నీ ఎద!!
జై తెలంగాణ జై జై తెలంగాణా!!
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి
పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి!!
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి!!
జై తెలంగాణ జై జై తెలంగాణా!!
అందెశ్రీ ప్రస్థానం
1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన గొడ్ల కాపరిగా పనిచేసారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు
జోల పాటలు కాదు.. పోరు పాటలు
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామం అందెశ్రీది. ఆయనకు కులం లేదు మతం లేదు. ఆయన నలుగురు పిల్లల సర్టిఫికెట్స్ లో కులం ఉండదు. చిన్ననాటి నుంచి వెంట వచ్చిన కష్టాలను మరిచిపోవడానికి రామాయణం, యక్షగానాలు కోలాటల్లో మునిగిపోయేవాడు. తెల్లవార్లు మోట కొట్టడం, అక్కడ పని పాటలు అల్లుకోవడం అశువుగా పాడటం అబ్బింది. ఏకసంతాగ్రహి కావడం వల్ల ఆయనకు అలవోకగా బాణీలు చరణాలు తోబుట్టువులయ్యాయి. పాట ప్రవాహమైంది. తన గుండె గాయం సలుపులు తీస్తున్న కొద్దీ కంఠ గేయం చిక్కగైంది.
కూలీ పని, మేస్త్రి పనీ ఇలా కనపడ్డ ప్రతి పని చేసిండు. బువ్వలేని బతుకు దుఃఖపూరితమైన జీవితం. 60 ఏళ్ల అందెశ్రీ జీవితం వడ్డించిన విస్తరి కాదు, వలపోతల కాగితం. తిరగబడనోడు గొప్ప కవి కాదు కదా, కనీసం కవి కూడా కాలేడు. లొంగిపోయేది, వంగిపోయేది జీవితం కాదు అంటాడు అందెశ్రీ. ‘‘జై బోలో తెలంగాణా.. జనగర్జనలా జడివాన’’ అని అందెశ్రీ పాడితే ఉస్మానియా యూనివర్సిటీ తొట్టెలలో వేసిన శిశువులా ఊగిపోయింది. కాంక్రీట్ జంగల్ లో మాయమైపోతున్న మానవుడిని వెతుకుతున్న సంచారి. ఆయనవి జోల పాటలు, జోకుడు పాటలు కాదు. రాజ్యం జోకొట్టి పడుకోబెట్టేవారి జబ్బజరిచి నిద్రలేపి, ఆత్మగౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరుపాటలు. అవి మండే నిప్పు కణికలు.
2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం వరించింది. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్. 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు అందెశ్రీ, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు అందెశ్రీ.
