థార్, బుల్లెట్ ఓనర్లు రోగ్స్.. హర్యానా డీజీపీ వివాదాస్పద వ్యాఖ్యలు

థార్, బుల్లెట్ ఓనర్లు రోగ్స్.. హర్యానా డీజీపీ వివాదాస్పద వ్యాఖ్యలు

చండీగఢ్: హర్యానా డీజీపీ ఓపీ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. థార్ కారు, బుల్లెట్ బండ్లు నడిపేటోళ్లు రోగ్స్ అంటూ వ్యాఖ్యానించారు. శనివారం చండీగఢ్‌‌‌‌లో మీడియాతో డీజీపీ మాట్లాడారు. 

ఈ సందర్భంగా వాహనాల తనిఖీల గురించి ప్రస్తావిస్తూ .. ‘‘పోలీసులు ప్రతి వాహనాన్ని ఆపరు. థార్ కారు, బుల్లెట్ బండ్లను మాత్రం కచ్చితంగా ఆపుతారు. ఎందుకంటే వాటిని వాడే వాళ్లందరూ రోగ్స్. మీ వెహికల్ మీ మైండ్‌‌‌‌సెట్‌‌‌‌ను తెలియజేస్తుంది. థార్ నడిపేటోళ్లు రోడ్ల మీద స్టంట్లు చేస్తుంటరు. ఇటీవల ఓ అసిస్టెంట్ కమిషనర్ కొడుకు థార్ నడుపుతూ ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. తన కొడుకును రక్షించడానికి ఆ అధికారి ప్రయత్నించాడు. అసలు ఆ కారు అసిస్టెంట్ కమిషనర్ పేరు మీదే ఉన్నది. కాబట్టి అతనే రోగ్” అంటూ వ్యాఖ్యానించారు

. ‘‘ఎంతమంది పోలీసుల దగ్గర థార్ కార్లు ఉన్నాయో లిస్టు తయారుచేస్తే బాగుంటుంది కదా! ఎవరి దగ్గర థార్ ఉంటే వాళ్లు క్రేజీ. థార్ జస్ట్ కారు కాదు.. అది ఆ ఓనర్ ఎలాంటి వాడనేది తెలియజేస్తుంది” అని పేర్కొన్నారు. థార్ కార్లతో స్టంట్లు చేయడం, వాటి వల్ల ప్రమాదాలు జరుగుతుండడంతో డీజీపీ ఈ వ్యాఖ్యలు చేశారు.