మేఘా కంపెనీ బ్లాక్​లిస్ట్‌లో పెట్టాలి.. పదేండ్లలో 56 ప్రాజెక్టులు స్టార్ట్​ చేసి ఒక్కటీ పూర్తిచేయలే: ఏలేటి మహేశ్వర్​రెడ్డి

మేఘా కంపెనీ బ్లాక్​లిస్ట్‌లో పెట్టాలి.. పదేండ్లలో 56 ప్రాజెక్టులు స్టార్ట్​ చేసి ఒక్కటీ పూర్తిచేయలే: ఏలేటి మహేశ్వర్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మేఘా ఇంజినీరింగ్​ కంపెనీని బ్లాక్​లిస్ట్​లో పెట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్​ చేశారు.  రాష్ట్రంలో పదేండ్లలో ఆ​ కంపెనీ 56 పనులు చేపడితే, దాంట్లో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఆ కంపెనీ అక్రమాలపై తాను హైకోర్టుకు వెళ్తానని, అవసరమైతే సుప్రీంకోర్టునూ ఆశ్రయిస్తానని వెల్లడించారు.  సోమవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ లో ఏలేటి మహేశ్వర్​రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా మేఘా కంపెనీకి కేంద్ర సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఇచ్చిన షోకాజ్​ నోటీసులను రిలీజ్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేయడంతోపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర సర్కారు ఎందుకు వెనుకంజ వేస్తున్నదో అర్థంకావడం లేదని అన్నారు. సుంకిశాల ప్రాజెక్టులో గోడ కూలిన ఘటనకు పూర్తి బాధ్యత మేఘా ఇంజినీరింగ్ కంపెనీదే అని వాటర్ బోర్డు చెప్పినా, ప్రభుత్వం  ఎందుకు ఆ కంపెనీపై చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. 

మేఘా పనులను పబ్లిక్​డొమైన్​లో పెట్టాలి

 మేఘా కంపెనీ చేసిన పనులను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని ఏలేటి మహేశ్వర్​రెడ్డి డిమాండ్ చేశారు. కేరళలో నిర్మించిన ఒక ప్రాజెక్ట్ కు సంబంధించి మేఘా సంస్థకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిందని గుర్తుచేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చిందని, డిజైన్, వర్క్ లో లోపం ఉందని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. 

సెంట్రల్ గవర్నమెంట్ నోటీసులు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సంస్థపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. త్వరలోనే మేఘా సంస్థ అవినీతిపై మరిన్ని వివరాలు బయటపెడ్తానని అన్నారు.  కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. 

ప్రాజెక్టులు కుంగినా.. కూలినా మేఘా సంస్థపై చర్యలు తీసుకోరా? అని అడిగారు.  నాణ్యత లేని ప్రాజెక్టులను  మేఘా సంస్థ సొంత డబ్బుతో పు నర్నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.