- టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడి
తాడ్వాయి, వెలుగు : 2026 జనవరి నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం మహాజాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3,495 ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డి చెప్పారు. మంగళవారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఓఎస్‌డీ శివం ఉపాధ్యాయతో కలిసి మేడారంలో ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ బస్టాండ్, ప్రయాణికులు వేచి ఉండే ప్రదేశాలు, క్యూలైన్ పనులు, తాగునీటి సౌకర్యాల ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా సమ్మక్క, సారలమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆర్టీసీ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ... మేడారం జాతర సందర్భంగా 28 ఎకరాల్లో బస్టాండ్, క్యూలైన్లు, భక్తులు వేచి ఉండే గదుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. విధుల్లో ఉండే డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని, మెరుగైన రవాణా సేవలు అందించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్. మాట్లాడుతూ.. గత జాతరలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రవాణా సౌకర్యం, బస్సుల ఏర్పాటు విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.
తాడ్వాయి నుంచి మేడారం చేరుకునే అటవీ మార్గం మధ్యలో సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్య ఉండటంతో కమ్యూనికేషన్ కోసం ప్రతి కిలోమీటర్‌కు ఓ పోలీస్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీఎం మునిశేఖర్, ఈడీలు వెంకన్న, సల్మాన్, ఆర్‌ఎం విజయభాను, ఆర్ఎం రవిచంద్ర, డీఎస్పీ రవీందర్, సీఐ దయాకర్
పాల్గొన్నారు.
