మధిర మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం

మధిర మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం

మధిర, వెలుగు:  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం మధిర మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్పంచుల అభినందన సభ అనంతరం ఆయన నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. మున్సిపల్ కమిషనర్, కార్యాలయ సిబ్బందితో పలు అంశాలు చర్చించారు. ప్రభుత్వ సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బంది ఎంతమంది ఉన్నారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు ఎక్కడి నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి లాంటి వివరాలపై ఆరా తీశారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నూతన మున్సిపల్ కార్యాలయం భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ ను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. 

అభివృద్ధి ప్రణాళికలో భాగస్వామి నవుతా...

చింతకాని : - సర్పంచుల వెన్నంటి ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తోడుగా ఉండి గ్రామాల అభివృద్ధి ప్రణాళికలో భాగస్వామినవుతానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. చింతకాని, ముదిగొండ మండలాల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభను మంగళవారం  చింతకాని మండలంలోని నాగులవంచలో ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా  డిప్యూటీ సీఎం మాట్లాడుతూ 70వ దశకంలో కాంగ్రెస్ ఏక పార్టీగా ఉన్న సమయంలో మినహాయిస్తే  1983లో టీడీపీ వచ్చిన సందర్భం కానీ, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో కానీ, ఇప్పటిలా 131 స్థానాలకు 90 పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన చరిత్ర లేదని డిప్యూటీ సీఎం వివరించారు. 

మధిర నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమని, ఈ విషయాన్ని అంచనా వేసి తాను గెలిచిన మొదటిసారి ఎర్రుపాలెం మండలంలో కట్టలేరు ప్రాజెక్టును ఆధునీకరణ చేశామని, వైరా, బోనకల్లు మండలాలకు జాలిమూడి రిజర్వాయర్ నిర్మించామని, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టామని, అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించి నియోజక అభివృద్ధికి ప్రణాళికలు వేశానని వివరించారు. అదేవిధంగా ప్రస్తుతం గెలుపొందిన సర్పంచులు అందుబాటులో ఉన్న పరిమిత వనరులను ప్రాధాన్యత క్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. ఎవరు సర్పంచులుగా గెలిచిన ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి చేస్తామని  తెలిపారు.