ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) కు కేటాయించిన స్థలాన్ని ఆయన సందర్శించారు. కేటాయించిన భూమి విస్తీర్ణం, సరిహద్దులు, రహదారి అనుసంధానం, మౌలిక సదుపాయాల లభ్యతను సంబంధిత అధికారులతో చర్చించారు.
ప్రస్తుతం ఉన్న మొత్తం స్థలంను సేత్వార్, కాస్రా, నక్షా మ్యాప్ లను ఆధారంగా సమగ్రంగా సర్వే చేసి ఎంపిక చేసిన స్థలానికి సరిహద్దులు నిర్దేశించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాను పరిశ్రమలకు అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని, చెప్పారు. కలెక్టర్ వెంట మైనింగ్ ఏడీ సాయినాథ్, పరిశ్రమల శాఖ జీఎం సీతారాం నాయక్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్ శ్వేత ఉన్నారు.
భూసేకరణ పూర్తి చేయాలి
జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా పూర్తవడానికి భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో భూసేకరణ ప్రక్రియ, నేషనల్ హైవే నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మం నుంచిదేవరపల్లి, ఖమ్మం నుంచి కురవి సెక్షన్, నాగపూర్ నుంచి అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మేజర్ బ్రిడ్జిలు, వీయూపీలు, ఆర్ఓబీ పనులు స్పీడప్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, ఎన్ హెచ్ఏఐ పీడీ రామాంజనేయ రెడ్డి, ఈఈ యుగంధర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మూడవ విడత గ్రామాల్లో పోలింగ్ ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతమైన వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. సింగరేణి మండలం కారేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. జడ్పీ సీఈవో దీక్షారైనా, మండల ప్రత్యేక అధికారులు రాజేశ్వరి, చందన్ కుమార్, తహసీల్దార్ రమేశ్ ఉన్నారు.
