భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి సీతారామచంద్రస్వామికి గర్భగుడిలో సుప్రభాత సేవను చేశారు. బాలబోగం నివేదించారు. గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో హనుమాన్‌చాలీసా పారాయణం జరిగింది. ఆంజనేయస్వామికి తమలపాకులు, అప్పాలు, నిమ్మకాయల మాలలను నివేదించారు. ప్రత్యేక హారతులు సమర్పించారు. ప్రాకార మండపంలో సీతారామచంద్రస్వామి కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిగింది. భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు.
సాయంత్రం దర్బారు సేవ జరిగింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామానికి చెందిన సర్పంచ్ భద్రమ్మ 37 గ్రాముల వెండితో తయారు చేసిన రూ.73వేల విలువైన వెండి శఠారీని సీతారామచంద్రస్వామికి విరాళంగా అందజేశారు. అగ్నిప్రమాదాల నియంత్రణపై ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రమాదాలను నివారించడానికి చేపట్టాల్సిన జాగ్రత్తలు వివరించారు. భక్తుల రక్షణకు దేవస్థానంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఈవో దామోదర్‌రావు జిల్లా జడ్జితో పాటు భద్రాచలం ఏఎస్పీని కలిసి ముక్కోటి ఉత్సవాలకు ఆహ్వానించారు. ధనుర్మాసోత్సవాల నిర్వహణకు గోదావరి నుంచి తీర్థబిందెను అర్చకులు తీసుకొచ్చారు. యాగశాలలో ప్రత్యేక పూజలు జరిగాయి.
