హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధరణిలో లోపాలున్నాయని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు భూ భారతి పేరుతో ఇంకా పెద్ద దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. భూ భారతి పోర్టల్ సామాన్య రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఓటీపీ, భూ యజమాని అనుమతి లేకుండానే ఆన్లైన్ వ్యవస్థలను హ్యాక్ చేసి భూములు ఇతరుల పేర్లకు మారుతున్నాయన్నారు.
అచ్చంపేటలో అసైన్డ్ భూములను సాఫ్ట్వేర్ హ్యాక్ చేసి వేరే వాళ్లకు మార్చారని, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విలువైన భూములపై కాంగ్రెస్ నేతల కన్ను పడిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫుల్ టైమ్ బిల్డర్లా మారారని ఎద్దేవా చేశారు. జర్మనీ, అమెరికా పర్యటనల్లో తెచ్చిన పెట్టుబడులు ఎన్ని? వాటితో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? అనే వివరాలను ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
