- కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్
నస్పూర్, వెలుగు: సింగరేణి బొగ్గు బ్లాక్ కాంట్రాక్ట్ లో అవకతవకలు జరిగాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆరోపించారు. గురువారం బీజేపీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎస్వోటు జీఎం సత్యనారాయణకు వినతిపత్రం అందించి మాట్లాడారు. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎం లాగా వాడుతోందని విమర్శించారు. సింగరేణి సంస్థలో కాంట్రాక్టులను సీఎం తన కుటుంబసభ్యులకు అప్పచెప్పి సంస్థ ఆదాయాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సింగరేణి క్వార్టర్లకు రిపేర్లు, సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు, రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్మికులను మోసం చేసిందన్నారు.
సింగరేణి నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు ఉపయోగిస్తుందని, కానీ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు ఎ.కృష్ణమూర్తి, పానుగంటి మధు, సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, జీవీ ఆనంద్ కృష్ణ, కమలాకర్ రావు, ఎం.మొగిలి, మద్ది సుమన్, సదయ్య, సదానందం, శ్రీకాంత్ పాల్గొన్నారు
