చెన్నై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో మహాయుతి కూటమి(బీజేపీ, ఏక్‌నాథ్ షిందే శివసేన)గెలుపు అనేది అభివృద్ధికి దక్కిన ఫలితమని బీజేపీ నేత అన్నామలై అన్నారు. విభజనవాదాన్ని ముంబై ప్రజలు తిరస్కరించారని వెల్లడించారు. బీఎంసీలో బీజేపీ విజయంపై అన్నామలై ఎక్స్ వేదికగా స్పందించారు.‘‘ఎన్నికల్లో ముంబై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అభివృద్ధి వల్లే అక్కడ మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది.
రాష్ట్ర పాలనకు ప్రజల నుంచి బలమైన ఆమోదం లభించింది. ముంబై ప్రజలను భాషా, మతం, కులం పేరుతో చీల్చాలని ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. కానీ వారి ప్రయత్నాన్ని ముంబై ప్రజలు ఈసారి తిరస్కరించి..అభివృద్ధికి పట్టం కట్టారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాలు, పురోగతిపై ఎన్డీయే ప్రభుత్వం ఫోకస్ పెడితే..ప్రతిపక్షాలు మాత్రం విభజనవాదమనే పాత వ్యూహాన్ని అమలు చేస్తున్నది’’ అని అన్నామలై పేర్కొన్నారు.
