కంట్మోన్మెంట్ బై పోల్... బీజేపి అభ్యర్థిగా వంశా తిలక్

కంట్మోన్మెంట్ బై పోల్... బీజేపి అభ్యర్థిగా వంశా తిలక్

న్యూఢిల్లీ, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న బైపోల్ కు బీజేపీ తన అభ్యర్థిని డిసైడ్  చేసింది. డాక్టర్  టీఎన్  వంశా తిలక్  పేరును ఖరారు చేస్తూ పార్టీ నేషనల్  జనరల్ సెక్రటరీ అరుణ్  సింగ్  మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంటోన్మెంట్  స్థానంతో పాటు ఉత్తర ప్రదేశ్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను కూడా ఆయన ప్రకటించారు. యూపీలోని దద్రౌల్  నుంచి  అరవింద్  సింగ్, లక్నో ఈస్ట్  నుంచి ఓపీ శ్రీవాస్తవ్,  గైంసారి నుంచి శైలేంద్ర సింగ్, దుద్ది ఎస్టీ నియోజకవర్గం నుంచి శ్రావణ్  గౌడ్‌  పేర్లను ఖరారు చేశారు. అలాగే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి 12వ లిస్టును కూడా బీజేపీ రిలీజ్ చేసింది. ఇందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్  రాష్టాల్లో ఏడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.   

లోక్ సభ తో పాటే... 

నిరుడు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్  నుంచి బీఆర్ఎస్  అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు. ఇటీవలే ఆమె కారు ప్రమాదంలో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో  దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ స్థానానికి కూడా బైపోల్  నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్  ప్రకటించింది. దీని ప్రకారం మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్  కంటోన్మెంట్  స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కాగా, బీఆర్ఎస్  నుంచి లాస్య నందిత సోదరి నివేదితను ఆ పార్టీ బరిలో నిలిపింది. ఇక గత ఎన్నికల్లో బీజేపీ నుంచి సెకండ్  ప్లేస్ లో నిలిచిన నారాయణన్  శ్రీగణేశ్ కు అధికార పార్టీ కాంగ్రెస్  అవకాశం కల్పించింది. అయితే  గ్రౌండ్  లెవెల్ లో తమ ఓటు బ్యాంకు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొన్న బీజేపీ... మాదిగ సామాజికవర్గానికి చెందిన వంశా తిలక్ ను పోటీలో నిలిపింది.