
- స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ షురూ
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జిల్లా అధ్యక్షుల జాబితా రిలీజైంది. మొత్తం 19 జిల్లాల అధ్యక్షుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. మరో ఆరేడు జిల్లాలకూ ఒకటి, రెండు రోజుల్లో అధ్యక్షులను నియమించనున్నది. రాష్ట్రాన్ని బీజేపీ సంస్థాగతంగా 38 జిల్లాలుగా విభజించుకున్నది. శని, ఆదివారాల్లో నామినేషన్ల ప్రక్రియను బీజేపీ ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఈ క్రమంలో 27 జిల్లాలకు నామినేషన్లను స్వీకరించినట్లు తెలిసింది. దీంట్లో సోమవారం 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.
ఆదిలాబాద్కు పతంగి బ్రహ్మానందం, మంచిర్యాలకు వెంకటేశ్వర్ గౌడ్, ఆసిఫాబాద్ కు శ్రీశైలం ముదిరాజ్, నిజామాబాద్ కు దినేశ్ కులాచారి, కామారెడ్డికి నీలం చిన్నరాజులు, జగిత్యాలకు రాచకొండ యాదగిరి బాబు, పెద్దపల్లికి సంజీవరెడ్డి, మెదక్కు రాధామల్లేశ్ గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి రూరల్కు బుద్ది శ్రీనివాస్, నల్లగొండకు నాగం వర్షిత్ రెడ్డి, మహబూబ్ నగర్ కు పి.శ్రీనివాస్ రెడ్డి, వనపర్తికి దుప్పల్లి నారాయణ, హన్మకొండకు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్కు గంట రవికుమార్, జయశంకర్ భూపాలపల్లికి నిశిధర్ రెడ్డి, జనగామకు సౌడ రమేశ్, ములుగుకు సిరికొండ బలరాం, మహంకాళి సికింద్రాబాద్ కు గుండగోని భరత్ గౌడ్, హైదరాబాద్ సెంట్రల్కు లంకాల దీపక్ రెడ్డిని అధ్యక్షులుగా నియమించారు. మరో 8 జిల్లాల్లో నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో వాటి పేర్లను పెండింగ్లో పెట్టారు.
తీవ్రస్థాయిలో గొడవలున్న మరో 11 జిల్లాల్లో అసలు జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియనే ప్రారంభించలేదు. ఎలాంటి వివాదాలు లేని సగం జిల్లాల అధ్యక్షులను మాత్రమే ప్రకటించింది. కాగా.. జిల్లా అధ్యక్షుల నియామకంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పదవి ఆశించి దక్కని వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరో వైపు సగం జిల్లాలకు ప్రెసిడెంట్లను ప్రకటించడంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు అర్హత సాధించినట్లయింది. కేవలం రాష్ట్ర అధ్యక్షుడి నియామక అర్హత కోసమే 19 జిల్లాలకే అధ్యక్షులను పరిమితం చేసిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల పరిధిలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్కొక్కరి చొప్పున స్టేట్ కౌన్సిల్ సభ్యులను ఎంపిక చేసింది. ఈ లెక్కన 52 మంది పేర్లనూ ప్రకటించారు.