
- త్రీమెన్ కమిటీ పోటీకి ముగ్గురు,
- నలుగురి పేర్లు తెరపైకి తాజాగా పరిశీలనలో
- సినీనటి జయసుధ పేరు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధమైన బీజేపీ.. అభ్యర్థి వేటలో పడింది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఉండడంతో.. ఆ పార్టీ నేతలు దీనిపై ఫోకస్ పెంచారు. ఈ నియోజకవర్గం సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో ఉండటంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, కొత్తగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాంచందర్‌రావుకు ఈ ఎన్నికల్లో గెలవడం సవాల్‌గా మారింది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో 1.83 లక్షల ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కేవలం 25,866 ఓట్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డితో పాటు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, అట్లూరి రామకృష్ణ తదితరుల పేర్లు ఇప్పటివరకూ వినిపించాయి. తాజాగా సినీనటి జయసుధ పేరు తెరపైకి వచ్చింది. మూడురోజుల క్రితం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్‌రావు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతం, ప్రజాసేవ దిశగా కార్యాచరణపై ఆమెతో చర్చించినట్టు రాంచందర్ రావు ‘ఎక్స్’ లో పోస్టు చేయడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత పేరును ప్రకటించింది. ఈ క్రమంలో బీజేపీ నుంచి కూడా మహిళా అభ్యర్థిని బరిలో దింపితే ఎలా ఉంటుందనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతున్నది.
ఎంపికకు కమిటీ
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాంచందర్ రావు నియమించారు. కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం ఈ కమిటీ అక్కడ నేతలను, ప్రజలను కలిసి అభిప్రాయాలు సేకరిస్తుంది. ఆ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కొందరు నేతలు చెప్తున్నారు. అయితే కిషన్ రెడ్డిదే తుది నిర్ణయం అవుతుందని మరికొందరు అంటున్నారు. నిజానికి రాజాసింగ్ రాజీనామాతో హైదరాబాద్ లో బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీంతో జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలవాలని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో పర్యటనలు పెంచారు. కాలనీలు, బస్తీల్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకు సైతం ఆయన హాజరవుతున్నారు.
ఆశావహుల్లో విభేదాలు..
అభ్యర్థి ఫైనల్ కాకపోవడంతో.. టికెట్ ఆశిస్తున్న నేతలంతా జూబ్లీహిల్స్ లో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో కొందరు నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న ఓ మహిళా నేత లోకల్ కేడర్ తో కలిసి సెగ్మెంట్ లో తిరిగితే.. ఆమెతో తిరిగిన నేతలకు కొందరు ఫోన్లు చేసి బెదిరించారని పార్టీ ఆఫీసుకు ఫిర్యాదులు అందాయి. మరోపక్క కమిటీలో లేని వారిని మీటింగులకు పిలవొద్దని కమిటీ నేతలకే కొందరు వార్నింగులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఓ నేత తానే అభ్యర్థిని అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. దీంతో కేడర్‌లో అయోమయం నెలకొన్నది.