మోదీ, అమిత్‌‌ షా ముద్దుల బిడ్డ కేసీఆర్: అద్దంకి దయాకర్

మోదీ, అమిత్‌‌ షా ముద్దుల బిడ్డ కేసీఆర్: అద్దంకి దయాకర్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు మాజీ సీఎం కేసీఆర్ ముద్దుల బిడ్డ అని తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో బీఆర్ఎస్‌‌తో పాటు బీజేపీ హస్తం కూడా ఉందని ఆరోపించారు. గత సర్కార్‌‌‌‌లో జరిగిన అవినీతి నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీని బీజేపీ కాపాడుతున్నదన్నారు. అవినీతి చేసిన ఎవర్నీ వదిలేది లేదని, అందులో బీజేపీ నేతల పాత్ర ఉన్నా వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి బీజేపీ, బీఆర్ఎస్‌‌ కలిసి రోజుకో డ్రామాకు తెరలేపుతున్నారని విమర్శించారు. 

ఇందులో భాగంగానే కవితకు సీబీఐ నోటీసుల పేరిట కొత్త నాటకం మొదలు పెట్టారన్నారు. బిజీగా ఉన్నానని చెప్తే కవితకు మినహాయింపు ఇస్తున్న దర్యాప్తు సంస్థలు.. సోనియా గాంధీ, హేమంత్ సోరెన్, ఇతర నాయకులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. లిక్కర్ స్కాం వ్యవహారంతో బీఆర్ఎస్‌‌ను బీజేపీ లొంగదీసుకుందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌‌కు, ఎంపీలు బీజేపీకి అనేలా ఆ రెండు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయన్నారు. కవితను అరెస్ట్ చేయకపోవడం, రాష్ట్ర అధ్యక్షుడిగా బండిని మార్చడం ఇందులో భాగమని ఆరోపించారు. బీజేపీతో పొత్తో, ఎత్తో తెలియక కేసీఆర్ చిత్తయ్యారన్నారు. కాగా, తనను ఎంపీగా పంపాలో, మంత్రిని చేయాలో పార్టీ హైకమాండ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని దయాకర్‌‌‌‌ తెలిపారు.